3, జులై 2010, శనివారం
అప్పన్న నిజరూప దర్శనం
విశాఖపట్నం, చైతన్యవారధి: ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సదూర ప్రాంతాల నుండి తమ ఆరాధ్య దైవం సింహాచల శ్రీ వరాహాలక్ష్మి నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం తరలివచ్చే భక్తులందరికి దర్శనం కల్పించే విధంగా జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. ఆదివారం జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను మంత్రి బాలరాజు స్థానిక ఎమ్మెల్యే ఎం.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు కర్రి సీతరామ్, తిప్పల గురుమూర్తి రెడ్డిలతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసిన క్యూలైన్ల నిర్మాణం, రూ.500, రూ.200, ఫ్రీ, విఐపి, వివిఐపీల కోసం విడివిడిగా ఏర్పాటు చేస్తున్న క్యూలు, వాటి ప్రవేశం , బయటకు వచ్చే మార్గం తదితర అంశాలపై ఆయన అధికార్లుతో చర్చించారు. అనంతంరం స్థానిక విలేకర్లతో మంత్రి బాలరాజు మాట్లాడుతూ ఈ ఏడాది చందనోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా తొలిసారి నిర్వహిస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా భావించి వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికార్ల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రధాన సమస్యలను ఇప్పటికే గుర్తించామని ఉన్నతాధికార్లు సమావేశంలో గతంలో జరిగిన లోటుపాట్లపై చర్చించామని, మంత్రి తెలిపారు. ప్రధానంగా భక్తులు అధికంగా రావటంతో సింహగిరిపై పారిశుద్య నిర్వాహణకు అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్ను అదే విధంగా కొండ దిగువన కూడా పారిశుద్య నిర్వాహణకు మరొక ఎఎంఅండ్ హెచ్ఓ, శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు అదనపు పారిశుధ్య కార్మికులను నియమించినట్లు ఉత్సవ నిర్వాహణ కమిటీ సభ్యుడు జిల్లా జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని విఐపిలకు ఇచ్చిన పాసులపై వారి దర్శన వేళలను ముద్రించామని దీనితో రద్దీని కొంతమేరకు నియంత్రించనున్నట్లు తెలిపారు. వికలాంగులను కూడా విఐపిల క్యూలైన్లలో దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు. సింహగిరికి చేరుకున్న మంత్రి పసుపులేటి బాలరాజు సింహాచల దేవస్థానం ఈవో ప్రేమ్‌కుమార్ స్వాగతం పలికారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి