Loading...

7, అక్టోబర్ 2010, గురువారం

పారిశుద్ధ్యం పరిరక్షణకు చిత్తశుద్ధి ఏది?

పారిశుద్ధ్యం పరిరక్షణకు చిత్తశుద్ధి ఏది?

పారిశుద్ధ్యం పరిరక్షణ విషయంలో పాలకులు, అధికార్లు అలసత్వం చూపుతున్నారు. పారిశుద్ధ్య పరిరక్షణకు ఖర్చు చేస్తున్న నిధులకు, వస్తున్న ఫలితాలకు పొంతన ఉండటం లేదు. ఏ గ్రామ ముఖ ద్వార రోడ్లను చూసినా పారిశుద్ధ్యం విషయంలో పాలకుల నిబద్ధత ఏపాటిదో ఇట్టే అర్ధమవుతుంది. రోడ్లు బహిరంగ మలముత్రాల విసర్జన, పేరుకుపోయిన చెత్త చదారంతో దర్శనమిస్తాయి. గ్రామానికి ఏవరైనా నేతలు వచ్చినప్పుడో, ఏదైనా సభలు, సమావేశాలు నిర్వహించినప్పడు మాత్రమే రోడ్లును ఉడ్చి బ్లీచింగ్‌ జల్లుతున్నారు. మిగతా సమయాల్లో పట్టించుక్ను నాథుడే ఉండటం లేదు. అపారిశుద్ధ్య పరిస్థితులకు కారకాలైన మురుగునీరు నిర్వాహణ, కుక్కలు, పందుల నియంత్రణ, బహిరంగ మల విసర్జన నిర్మూలనపై దృష్టి సారించిన నాడే గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య పరిస్థితులు ఏర్పడతాయి. మురుగు నీరు నిర్వాహణకు సమర్ధవంతమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కాని పాలకులు చాలా చోట్ల ఈ విషయంపై శ్రద్ధ చూపిన దాఖలాలు కనిపించవు. అవసరమైన ప్రదేశాల్లో కాల్వలు నిర్మాణం చేపట్టడం లేదు. తమకు ఎక్కువ శాతం కమీషన్లు వచ్చే పనులుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నిధులను ఏదో విధంగా ఖర్చు చేయడానికి చూస్తున్నారు తప్ప సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు చాలా తక్కువనే చెప్పవచ్చు. కుక్కలు, పందుల నియంత్రణ చేస్తున్నప్పటికీ ఇవి కూడా అంతంత మాత్రమే. పారిశుద్ధ్య పరిరక్షణలో అత్యంత కీలకమైనది బహిరంగ మల విసర్జన. దీని నిర్మూలనకు వ్యక్తి గత మరుగు దొడ్లు నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. అయితే వ్యక్తి గత మరుగుదొడ్లు ఉన్నా గ్రామాల్లో వాటిని 95 శాతానికి పైగా ప్రజలు ఉపయోగించడం లేదు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు గ్రామాల్లో నిర్వహించిన పారిశుద్ధ్య అవగాహన సదస్సులు తూతూ మంత్రంగానే జరిగాయి. నేటికీ ప్రజలు మరుగుదొడ్లును ఉపయోగించటం లేదు. దీనికి ప్రధాన కారణం వీటిని ఏ విధంగా ఉపయోగించాలో ఎక్కువ మందికి తెలీదు. ఒక వేళ తెలిసినా విపరీతమై దుర్వాసన వస్తుందనే అభిప్రాయంతో ఉపయోగించడం లేదు.

అదీ గాక వ్యక్తి గత మరుగుదొడ్లను ఉపయోగించడానికీ ఎక్కువ నీరు అవసరమవుతుందని,తాగడానికే నీరు దొరకనప్పడు మరుగుదొడ్లు ఉపయోగించడానికి నీరు ఎక్కడ నుంచి వస్తుందని చాలా మంది అంటున్నారు. ఈ ప్రాధిమికమైన అంశాలపై దృష్టి సారించి, ప్రజలకు అవగాహన కల్పిస్తే చాలా మంది వ్యక్తిగత మరుగుదొడ్లను ఉపయోగించే అవకాశం ఉంది. వ్యక్తి గత మరుగుదొడ్ల వినియోగం పెరిగిన కొద్ది బహిరంగ మల విసర్జన తగ్గి చాలా వరకు పారిశుద్ధ్య సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే ప్రజల్లో ఈ విషయమై అవగాహన తీసుకు రావడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదు. పారిశుద్ధ్యంతోనే ప్రజల ఆరోగ్యం ముడిపడి ఉంది. కాబట్టి ప్రజా ప్రతినిధులు, అధికార్లు పారిశుద్ధ్య పరిరక్షణకు నిబద్ధతతో పని చెయ్యాల్సి ఉంది. ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉంది. గ్రామాల్లో ఉన్న పెద్దలు, యువకులు, యువజన సంఘాలు, మహిళా, పోదుపు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పారిశుద్ధ్య పరిరక్షణకు పూనుకోవాల్సి ఉంది. మురుగు నీరు వాడకాన్ని తగ్గించే విధంగా స్థానికుల్లో అవగాహన తీసుకు రావాలి. చెత్తా చదారాన్ని రోడ్లపై వేయకుండా వారికి వివరించాలి. మరుగుదొడ్లును వినియోగించే విధంగా అవగాహన కల్పించాలి. ముందుగా వీరు పారిశుద్ధ్య పరిరక్షణకు పై అంశాలపై అవగాహన పెంపొందించుకొని ఆచరించాలి. గ్రామంలో ఆరోగ్య వంతమైన వాతావరణం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చెయ్యాల్సి ఉంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి