Loading...

11, అక్టోబర్ 2010, సోమవారం

పర్యటక కార్మికుల సమ్మె విరమణ

విశాఖరూరల్, చైతన్యవారధి: అరకులోయ ప్రాంతంలోని అయిదు పర్యాటక శాఖ అతిథి గృహాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సమ్మె విరమించారు. గత ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులతో పర్యాటక శాఖ కార్యనిర్వాహక సంచాలకులు బాలసుబ్రహ్మణ్యరెడ్డి, జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు టూరిజం శాఖ కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.గంగరాజు, స్థానిక జడ్పీటీసీ సభ్యులు కిల్లో సురేంద్రలు చర్చలు జరిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని అయిదు యూనిట్లలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు టూరిజం శాఖ అంగీకరించింది. శాశ్వత కార్మికుల మాదిరిగానే కాంట్రాక్టు కార్మికులకు కూడా వేతనాల పెరుగుదలను వర్తింపజేసేందుకు అధికారులు ఒప్పుకున్నారు. మేన్‌పవర్‌ ఏజెన్సీని రద్దు చేసి నేరుగా కార్పొరేషన్‌ కాంట్రాక్టు కార్మికులుగా నియమించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. అలాగే కార్మికులకు ఎస్‌సీఏను అమలు చేసేందుకు, వేతనాల్లో 40 శాతం పెరుగుదలతోపాటు సెక్యూరిటీ, గార్డెన్‌, డ్వాక్రా కార్మికుల దినసరి వేతనాలను రూ.202లకు పెంచాలన్న డిమాండ్లను అధికారులు అంగీకరించారు. టూరిజం కార్మికులకు కార్మిక చట్టాలను అమలు చేయడం, పదోన్నతుల్లో రిజర్వేషన్లు పాటించడం, బస్‌ పాస్‌కు సొమ్ము చెల్లింపు, బీమా వర్తింపు, వైద్యసేవలు, టూరిజం ఆదాయంలో స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయి సొమ్మును చెల్లించడం వంటి డిమాండ్ల పరిష్కారానికి ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలపై కార్మిక నాయకులు, టూరిజం అధికారులు సంతకాలు చేశారు. అనంతరం కార్మికులు అరకులోయ టౌన్‌షిప్‌లో భారీ ర్యాలీ నిర్వహించి విజయోత్సవ సభ జరిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సూర్యనారాయణ, ఉమామహేశ్వరరావు, బాల్‌దేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి