Loading...

8, అక్టోబర్ 2010, శుక్రవారం

చిన్న పత్రికలకు ప్రకటనల నిలిపివేత

హైదరాబాద్‌: రాష్ట్రంలో చిన్న పత్రికల హవాను దెబ్బతీసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గత కొంత కాలంగా చిన్న పత్రికల నిర్వాహకుల తీరుపై గుర్రుగా ఉన్న కొంత మంది ఇటీవల చురుగ్గా పావులు కదిపి సమాచార శాఖ అధికారులపై వత్తిడి తెచ్చిన ఫలితంగా నెల రోజుల వరకూ చిన్నపత్రికలు, మ్యాగజైన్లకు ప్రకటనలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా వెలువరించింది. చిన్న పత్రికలు, మ్యాగజైన్ల సర్క్యులేషన్, ప్రచురణ ఇతర వివరాల పరిశీలనకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను నియమించినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ కమిషనర్ సి.పార్థసారధి తెలిపారు. జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి లభించే ఆరోగ్యశ్రీ, ఇళ్ళస్థలాలు, పెన్షన్లు, మెడిక్లెయిమ్, ఇతర అవకాశాలు అర్హులైన లబ్ధిదారులకే అందాలన్న ఉద్దేశంతోనే ఈ పరిశీలన చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించినా, అసలు ఉద్దేశం వేరే ఉందన్నది స్పష్టమవుతోంది. కొన్ని సందర్భాలలో పెద్ద పత్రికలతో సమానంగా కొన్ని చిన్న పత్రికలు కూడా ప్రభుత్వ ప్రకటనల విషయంలో లాభపడుతుండడాన్ని ఆయా పెద్ద పత్రికల యాజమాన్యాలకు గిట్టడం లేదని తాజా పరిస్థితులను బట్టి స్పష్టమవుతోంది. చిన్న పత్రికలపై కొరడా ఝుళిపించడాన్ని మాత్రం చిన్న పత్రికలపై ఆధారపడి జీవిస్తున్న జర్నలిస్టులు అంగీకరించలేకపోతున్నారు. పరిశీలన, అర్హతల నిర్ధారణ పేరిట తమ జీవితాలను నాశనం చేయాలని చూడవద్దని, ఎన్నో ఏళ్లుగా ఇదే రంగంపై ఆధారపడి బతుకుతున్న చిన్న పత్రికల జర్నలిస్టులను, నిర్వాహకులను రోడ్డున పడవేసే చర్యలు మానుకోవాలని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పత్రికల సంపాదకుల సంఘం (ఎస్మా) ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. అయితే, తాము జరుపుతున్న పరిశీలన కేవలం అనర్హులను ఏరివేయడానికే తప్ప అర్హులకు అన్యాయం చేయడానికి కాదని సమాచార శాఖ చెబుతోంది. ఇదే విషయాన్ని ఆ శాఖ కమిషనర్ పార్ధసారధి మీడియా ప్రతినిధుల వద్ద స్పష్టంచేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి