విశాఖపట్నం: డీఎస్సీ-2008 అభ్యర్థులకు మరో తీపి కబురు. వీరి నియామకాలకు సంబంధించి మరికొందరికి ఉద్యోగాలు లభించనున్నాయి. దాదాపు మరో 150 మంది అభ్యర్థులకు ఎస్జీటీ ఉద్యోగాలు దక్కనున్నాయి. డీఎస్సీ రాసిన వారిలో చాలామంది పాఠశాల సహాయకులు (ఎస్ఏ)తోపాటు మాధ్యమిక విద్యా గ్రేడ్(ఎస్జీటీ)లుగా కూడా అవకాశం పొందారు. గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన కౌన్సెలింగ్లో పలువురు అభ్యర్థులు ఎస్ఏ ఉద్యోగాలను ఎంచుకున్నారు. మరికొందరు ఇతర ఉద్యోగాల్లో ఇప్పటికే స్థిరపడినవారు, ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంలేనివారు ఉన్నారు. దీంతో ప్రతిభ జాబితా నుంచి ఇలాంటి వారి పేర్లను తొలగించి మళ్లీ తాజా జాబితా రూపొందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా ఇటువంటివారు సుమారుగా 150 మంది వరకు ఉంటారని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్జీటీ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల రెండు నుంచి అయిదో తేదీ వరకు కౌన్సెలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 1134 మందికి నియామక ఉత్తర్వులిచ్చారు. అవసరమైనన్ని ఖాళీలు లేకపోవడంతో మరో 280 మందికి ప్రభుత్వాదేశాల మేరకు ఉద్యోగ హామీ పత్రాలను అందజేశారు. ఇంకా చాలామంది అభ్యర్థులకు ఉద్యోగావకాశం దక్కలేదు. తాజాగా రూపొందించనున్న జాబితాలో ఇలాంటి వారికి అవకాశం లభించనుంది. వీరికి చెందిన జాబితాను సోమవారం నుంచి తయారుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
25 నుంచి కౌన్సెలింగ్: డీఈవో కొత్తగా ప్రతిభ జాబితాలోకి వచ్చిన అభ్యర్థులకు ఈ నెల 25న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సూర్యనారాయణ తెలిపారు. నోటిఫికేషన్లో ప్రకటించిన మొత్తం 1435 ఖాళీలను భర్తీచేసేందుకు దశలవారీగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ నెల మొదటివారంలో నిర్వహించిన కౌన్సెలింగ్కు గైర్హాజరైన 178 మందికి బుధవారం కౌన్సెలింగ్ చేస్తామని ఆయన చెప్పారు. వీరిలో కూడా చాలామంది వచ్చే అవకాశాలు తక్కువని తెలిపారు. ఇందులో ఏర్పడిన ఖాళీలను భర్తీచేసేందుకు ఉద్యోగ హామీ పత్రాలిచ్చిన అభ్యర్థులకు ఈ నెల 27న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. డీఎడ్ అభ్యర్థులకూ ఈ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిరాజు డిమాండ్ చేశారు. తాజాగా మరికొంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించినందుకు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ హర్షం వ్యక్తం చేశారు. వీరందరికీ సక్రమంగా కౌన్సెలింగ్ నిర్వహించి ఉత్తర్వులివ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఎంతో సంతోషకరమైందని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మధు హర్షం తెలిపారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి