-ముఖ్యమంత్రి రోశయ్య వెల్లడి
హైదరాబాద్ : కాపులను బీసీ జాబితాలో చేర్చాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తెలగ కాపు బలిజ సంఘం స్వర్ణోత్సవాలు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని సంఘం ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం రోశయ్య ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తాను ఈ విషయంపై చర్చలు జరిపానంటూ గుర్తుచేశారు.'కుల సంఘాల ఏర్పాటులో తప్పులేదు. దాదాపు అన్ని కులాలకు సంక్షేమ సంఘాలు ఉన్నాయి. అయితే ఇతరులతో స్నేహభావంతో మెలుగుతూ సొంతవర్గం సంక్షేమానికి పాటు పడడమే లక్ష్యంగా ఉండాలి. నేను ఒక కులంలో పుట్టాను, పుట్టినపుడు నాదే కులమో నాకు తెలియదు, అమ్మానాన్న చెప్పారు, చుట్టుపక్కలవారు అలాగే అన్నారు. దాంతో అదే కులానికి చెందిన వాడిగా కొనసాగుతున్నా'ను అని రోశయ్య తన గురించి వివరించారు. ప్రభుత్వం చేయలేని కొన్ని పనులను ఇలాంటి సంఘాలు చేస్తుంటాయని పేర్కొన్నారు. కాపు తెలగ బలిజ సంఘం ఆధ్వర్యంలో విద్యాలయం ఏర్పాటుకు హైదరాబాద్ శివారులో తగిన స్థలం కేటాయించేందుకు యత్నిస్తానని సీఎం హామీ ఇచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గతంలోమైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లను హడావుడిగా ప్రకటించిన తరువాత సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయన్నారు. అందుకే, కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. గ్రామీణాభివృద్ధి మంత్రి వట్టివసంతకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వంలో కాపులు తక్కువగా ఉన్నందున నామినేటెడ్ పదవుల్లో తగిన న్యాయం చేయాలని సీఎం రోశయ్యను సభాముఖంగా కోరారు. కాపు సంఘం వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అంద జేశారు. స్వర్ణోత్సవ జ్ఞాపికను విడుదల చేశారు.కాపు తెలగ బలిజ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీహరి, పత్స వినాయకస్వామి, ఉత్సవ సమన్వయకర్త ఎం.గోపాలకృష్ణ, మాజీ అడ్వొకేట్ జనరల్ అనంతబాబు, అద్దెపల్లి శ్రీధర్, మాజీఎంపీ రామచంద్రయ్య, ఈలినాని తదితరులు పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి