Loading...

21, నవంబర్ 2010, ఆదివారం

మా హయాంలోనే మహిళాభివృద్ధి

- టిడిపి అధినేత చంద్రబాబునాయుడు
గాజువాక, నవంబర్ ౨౧, (చైతన్యవారధి): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. 'సూక్ష్మ రుణాలపై' పాతగాజువాకలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి, వారికి రుణాలు మంజూరు చేసి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, అభివృద్ధికి దోహదం చేశామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయకపోవడంతో మహిళలు మైక్రోఫైనాన్స్‌ సంస్థలను ఆశ్రయించారని తెలిపారు. మైక్రో సంస్థల అధిక వడ్డీలు కట్టలేక, వారి వేధింపులకు మహిళలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్‌ వారు ఇక నుండి మీ ఇళ్లల్లోకి వస్తే టిడిపి అండగా ఉంటాదని మహిళలకు హామీ ఇచ్చారు. నిర్వాసితుల సమస్య చంద్రబాబు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. నిర్వాసితులకు టిడిపి అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పారు. 6 మిలియన్ల టన్నుల సామర్థ్యం గల స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు లేకపోవడం శోచనీయమన్నారు. బ్రాహ్మణి స్టీల్‌కు కేటాయించిన ఓబులాపురం గనులు రద్దు చేసి, వాటిని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. గంగవరం నిర్వాసితులకు వెంటనే ఉపాధి కల్పించాలని కోరారు. గాజువాక హౌస్‌కమిటీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, వీటిని అరికట్టడానికి ఈ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి దోపిడీకి నాంది పలికారని విమర్శించారు. రాష్ట్రంలో 106 ఎస్‌ఇజెడ్‌లు ఏర్పాటు చేసి రైతుల భూములు లాక్కున్నారని, జలయజ్ఞం పూర్తిగా ధన యజ్ఞంగా మారిందని వెల్లడించారు. రాజశేఖరరెడ్డి అవినీతిని కేంద్రప్రభుత్వం ప్రోత్సహించిందని పేర్కొన్నారు. కార్గిల్‌ అమర వీరులకు సంబంధించిన ప్లాట్లలో కూడా అవినీతికి పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. టిడిపి హయాంలో టెక్నాలజీ అభివృద్ధి చెందిందన్నారు. పేదరికంలేని సమాజంగా అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమన్నారు. ముందుగా బిసి రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోన తాతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టిడిపి జిల్లా నాయకులు గుడివాడ నాగమణి, కార్పొరేటర్లు ఎండి.రఫీ, పల్లా శ్రీనివాస్‌, లేళ్ల కోటేశ్వరరావు, జి.వెంకునాయుడు, గంధం శ్రీనివాసరావు, జి.అమర్‌నాధ్‌, టిడిపి నాయకులు పప్పు రాజారావు, హర్షవర్ధన్‌ ప్రసాద్‌, పప్పు శంకరరావు ఎం.శంకరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి