Loading...

18, నవంబర్ 2010, గురువారం

నేటి నుంచి జిల్లాలో చంద్రబాబు పర్యటన

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం నగరానికి రానున్నారు. పార్టీ శ్రేణుల్లో జవసత్వాలు నింపేందుకు ఆయన జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. మూడో రోజు నగరంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తం ఏడుచోట్ల చంద్రబాబు సభలు ఉండేలా పార్టీ నేతలు ప్రణాళిక రూపొందించారు. నగరానికి సంబంధించి చంద్రబాబు ప్రధానంగా కాలుష్యం, సింహాచల భూ వివాదం, సూక్ష్మ రుణ సంస్థల వల్ల మహిళల ఇబ్బందులు, ఆస్తి పన్ను పెంపు వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. ఈమేరకు ఆయా ప్రాంతాల్లో నిర్వహించే సభల్లో పాల్గొని బాధితుల్లో భరోసా నింపే ప్రయత్నం చేయనున్నారు. తెదేపా అధినేత గురు, శుక్రవారాల్లో జిల్లాలోని ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. పార్టీ వ్యవహారాలపైనా దృష్టి పెట్టేందుకు 20న సాయంత్రం 6 గంటలకు నగరంలోని సుబ్బలక్ష్మి కల్యాణ మండపంలో జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షిస్తారు. పార్టీలో ఐక్యత సాధించే విషయంపై ఆయన దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు, మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మధ్య ఐక్యత కొరవడడంతో నేతలు వర్గాలుగా చీలిపోయారు. నగర పార్టీ నేతల్లోనూ విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల నగర పార్టీ అధ్యక్షుడు పీలా శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు శ్రీహరిరాజు బాహాటంగానే గొడవకు దిగారు. కార్పొరేటర్ల మధ్య కూడా అధిపత్య పోరు నడుస్తోంది. ఈ అంశాలన్నింటిపైనా చంద్రబాబు సమీక్షించి నేతలకు దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి