హైదరాబాద్: రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశుసంవర్థకశాఖ మంత్రి విశ్వరూప్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖమంత్రి తోట నరసింహంలు సోమవారం సచివాలయంలో వారి వారి ఛాంబర్లలో ప్రవేశించి బాధ్యతలు స్వీకరించారు. తొలిదస్త్రాలపై సంతకాలు చేశారు. విశ్వరూప్ తొలుత ఉదయం 8.45గంటలకు జె. బ్లాక్ ఐదో అంతస్తులోని 510నెంబరు గదిలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామర్లకోటలోని టీకాల కేంద్రాన్ని రూ.6.39కోట్లతో ఆధునికీకరిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. ప్రాధాన్యత ఉన్నశాఖ ఇవ్వలేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి బొత్స
సత్యనారాయణ సోమవారం ఎలాంటి ఆర్భాటాల్లేకుండా రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం ఆయన సాధారణంగానే వచ్చి జె బ్లాక్ మూడో ఫ్లోర్లోని తన పాత ఛాంబర్లోకి వెళ్లి విధి నిర్వహణ చేపట్టారు. చాలామంది మంత్రులు పూజలు.. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య విధుల్లో చేరుతున్న విషయం తెలిసిందే. బొత్స దీనికి భిన్నంగా వ్యవహరించారు. ఈనెల 9వ తేదీ తరువాత రవాణాశాఖ సమీక్ష నిర్వహిస్తానని ఆశాఖ కమిషనర్ ప్రేమచంద్రారెడ్డికి ఫోన్ ద్వారా బొత్స తెలిపారు. ఈశాఖ పట్ల పూర్తిగా అవగాహన పెంచుకుని శాఖపరమైన అభివృద్ధి సాధనకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. సోమవారం సాయంత్రం ఆర్టీసీ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ను బొత్స కలిసి ఆశ్వీరాదం తీసుకున్నారు. తనకు తగిన తోడ్పాటునివ్వాల్సిందిగా కోరారు. దీనికి ఎంఎస్ఆర్ స్పందిస్తూ ఇద్దరం కలిసి ఆర్టీసీ అభివృద్ధి కృషి చేద్దామని చెప్పారు. బొత్సను మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి