Loading...

7, డిసెంబర్ 2010, మంగళవారం

హోంగార్డుల సేవలు ప్రశంసనీయం

విశాఖపట్నం, డిసెంబరు 6 (చైతన్యవారధి): ప్రజలకు సేవలు అందించడంలో పోలీసులతోపాటు హోంగార్డులు కూడా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారని పోలీసు కమిషనర్‌ పూర్ణచంద్రరావు కొనియాడారు. పోలీసు పెరేడ్‌ గ్రౌండ్స్‌లో సోమవారం ఉదయం జరిగిన హోంగార్డుల ఆవిర్భావోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది వరకు హోంగార్డులుగా పనిచేసేందుకు పదవీ విరమణ చేసిన వ్యక్తులు వంటి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారని తెలిపారు. అప్పట్లో విధులు సేవా కార్యక్రమంగా
భావించే వారని గుర్తు చేశారు. రానురాను హోంగార్డుల వ్యవస్థ మరింత పటిష్ఠంగా రూపుదాల్చి, పోలీసు శాఖలో అంతర్భాగమైందని పేర్కొన్నారు. కీలకమైన సందర్భాల్లో ప్రత్యేకత చాటుకుంటోందని కొనియాడారు. కీలకమైన కేసుల పరిష్కారంలో చూపుతున్న చొరవ, సమాచార సేకరణలో వారు కనబరిచే నైపుణ్యం ప్రశంసనీయమని పేర్కొన్నారు. వారి సహకారం వల్ల పోలీసులు అనేక క్లిష్టమైన కేసుల్నీ తేలికగా పరిష్కరించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. హోంగార్డులు కేవలం జీతం దృష్టితోనే కాకుండా సేవాభావంతో పనిచేయాలని సూచించారు. వారికస్తున్న గౌరవ వేతనాన్ని పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చెప్పారు. యువత కూడా ఈ విధుల్లో కొనసాగాలని ఆసక్తి చూపడం మంచి పరిణామమని తెలిపారు. పోలీసు కమిషరేట్‌ నుంచి లీలా మహల్‌, డాల్ఫిన్‌ హోటల్‌, సరస్వతి పార్కు మీదుగా తిరిగి పోలీసు కమిషనరేట్‌ వరకు పెరేడ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో క్రైమ్‌ డీసీపీ బ్రహ్మారెడ్డి, లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ రామకృష్ణ, హోంగార్డు కమాండెంట్‌ కె.మోతీసాగర్‌, హోంగార్డు డీఎస్పీ వి.ఎస్‌.ప్రభాకరరావు, ఏసీపీలు సురేష్‌బాబు, కృష్ణమూర్తి నాయుడు, సీఐలు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి