Loading...

28, డిసెంబర్ 2010, మంగళవారం

కొణతాల కోటలో మంత్రి మంతనాలు

అనకాపల్లి, డిసెంబర్ 27: గడచిన కొంతకాలంగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు, కాంగ్రెస్ కార్యకలాపాలకు అల్లంత దూరంగా ఉంటున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కొణతాల జగన్‌తో జిల్లా మంత్రి బాలరాజు సోమవారం మధ్యాహ్నం రహస్య మంతనాలు జరిపారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌కు
దూరమై వైఎస్ తనయుడు జగన్‌కు అండగా నిలిచి ఓదార్పుయాత్ర విజయవంతానికి జిల్లావ్యాప్తంగా బలోపేతం చేసేందుకు నడుం బిగించిన నేపథ్యంలో ఆయన సన్నిహిత నేతగా, విధేయునిగా ముద్రపడిన జగన్‌తో కాంగ్రెస్ పెద్దలు రహస్య సమాలోచనలు జరపడం రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. వివిధ స్వచ్ఛంద సంస్థల్లో చురుకైన పాత్ర నిర్వహించే జగన్ 1999ఎన్నికల్లో కొణతాల నాయకత్వం పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో కొణతాల ఓటమి చవిచూడగా 2000లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగన్‌కు మున్సిపల్ చైర్మన్ టిక్కెట్ ఇప్పించి అతడిని గెలిపించేందుకు కొణతాల కృషిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొణతాల రామకృష్ణ క్యాబినెట్ మంత్రి అయ్యారు. తరువాత జరిగిన అనకాపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కొణతాల బలపరచిన కాంగ్రెస్ పాలకపక్షం విజయానికి జగన్ కృషిచేశారు. తరువాత క్రమంలో పార్టీ కార్యక్రమాల్లో జగన్ పాల్గొనలేదు. ఆవిధంగా కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న జగన్ గత శాసన సభ ఎన్నికల్లో కొణతాల తిరిగి జగన్ స్వగృహానికి వెళ్ళి ఆయన సహకారం కోరడం అందుకు ఆయన సానుకూలంగా స్పందించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొణతాల ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసి మంత్రి పదవి కోల్పోగా తరువాత జరిగిన కార్యక్రమాల్లో తిరిగి యథావిథిగానే కొణతాల, జగన్‌ల మధ్య ఎడబాటు కొనసాగుతోంది. జగన్‌కు మద్దతుగా కొణతాల అనకాపల్లి అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన సమీక్షా సమావేశాలకు కూడా జగన్‌కు ఆహ్వానం అందలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని కొణతాల వర్గీయులు అంటుంటే తనకు పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదని ఒక పథకం ప్రకారమే తనను దూరంగా ఉంచుతున్నారని జగన్ తన సన్నిహిత వర్గం వద్ద అంతర్మథనం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని జగన్ ప్రకటించగా కొణతాల సోదరుడు రఘునాథ్ కూడా అదేవాణి వినిపించారు. ఈ నేపథ్యంలో జిల్లామంత్రి బాలరాజును అనకాపల్లిలోని జగన్ చాంబర్‌కు తీసుకురావడంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంధానకర్తగా వ్యవహరించారు. అనకాపల్లిలో వివిధ స్వచ్చంధ సంస్థలతోను మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తనకు సమాచారం అందిందని మీ నాయకత్వంలో అనకాపల్లిలో కాంగ్రెస్ గట్టిబలాన్ని కూడగట్టుకోగలదనే ఆశాభావాన్ని జిల్లామంత్రి బాలరాజు వ్యక్తం చేసినట్లు తెలిసింది. నియోజకవర్గ నాయకత్వ బాధ్యతలను సైతం అప్పగిస్తామని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. జనవరి మొదటివారంలో తన భవిష్యత్ రాజకీయ కార్యకలాపాలను తెలియజేస్తానని జగన్ తనను కలవడానికి వచ్చిన నేతలకు స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగన్‌తోపాటు ఆర్‌ఇసిఎస్ మాజీ చైర్మన్ మళ్ల లక్ష్మీనారాయణ, పిఆర్‌పి నాయకులు మజ్జి ప్రసాదరావు, ఎఎంఎఎల్ కళాశాల మాజీ అధ్యక్షులు దాడి జగ్గప్పలస్వామి, మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ బుద్ధ సత్యనారాయణ, కశింకోట మండలంలోని రెండుమూడు గ్రామాల సర్పంచ్‌లు, మంత్రి బాలరాజును కలసి తమమద్దతు ప్రకటించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి