Loading...

28, డిసెంబర్ 2010, మంగళవారం

కేసులన్నీ ఎత్తివేసే వరకూ దీక్ష ఆగదు...

హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ ఉద్యమ సమయంల విద్యార్థులపై పెట్టిన కేసుల్ని ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆమరణ దీక్ష చేపట్టారు. కేసులన్నీ పూర్తిగా ఎత్తేసే వరకూ నిరశనలు ఆగవని సర్కారును హెచ్చరించారు.
ముందు ప్రకటించినట్టుగానే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆమరణ దీక్షకు దిగడంతో, ప్రభుత్వంలో అలజడి రేకెత్తింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హడావుడిగా అందుబాటులో ఉన్న మంత్రులతో మంతనాలు జరిపి, కేసుల ఎత్తివేసే అంశాన్ని సమీక్షించారు. గతంలో ఉపసంహరించుకున్నవి కాకుండా, మరో 135 కేసులు ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎంపీలకు తెలియబర్చి, దీక్షలను ఉపసంహరించేందుకు సర్కారు ప్రయత్నాలు ఆరంభించింది. రాత్రి 7.30 గంటల సమయంలో సర్కారు తరఫున రాష్ట్ర మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, కె జానారెడ్డి, బస్వరాజు సారయ్య, డి శ్రీ్ధర్ బాబు ఎంపీలు చేస్తున్న దీక్షా శిబిరానికి వెళ్ళి కొన్ని కేసులు ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయాన్ని చెప్పారు. కానీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎంపీలు సంతృప్తి వ్యక్తం చేయలేదు. మొత్తం కేసులు ఎత్తివేసేంత వరకూ దీక్ష విరమించేది లేదని మంత్రులకు తెగేసి చెప్పారు. దీంతో సమస్య పరిష్కారం కోసం పిసిసి చీఫ్ డిఎస్ రంగంలోకి దిగారు. దీక్షలు విరమించమంటూ విజ్ఞప్తి చేసేందుకు మంత్రులు ఎంపీల దీక్షా శిబిరం వద్దకు వచ్చినప్పుడు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హోంమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కొన్ని కేసులు ఎత్తివేసే విషయంలో న్యాయపరమైన చిక్కులు వస్తాయని అనుకుంటున్నందున, వాటి విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. అయితే ఆ సమయంలో ఎంపి కె రాజగోపాల్‌రెడ్డి మంత్రి సబిత చేతిలోనుంచి మైకు లాక్కొని కేసులు పెట్టి ఏడాది దాటిందని, ఇప్పటి వరకూ ఏమి చేశారని ప్రశ్నించారు. ఎంపి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని కేసులు ఎత్తివేసేంత వరకూ ఇక్కడి నుంచి కదలమని, దీక్ష విరమించేది లేదని ఖండితంగా చెప్పారు. ‘కేసుల ఎత్తివేసే విషయంలో ఆలోచించుకుని రేపో, ఎల్లుండో, లేదా మేం మరణించిన తర్వాత వస్తారో మీ ఇష్టం’ అని సర్వే ఆవేశంగా మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రితో మరోసారి మాట్లాడి వస్తామన్నారు. మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి కలిసి రావాల్సిందిగా ఎంపీలు తెలంగాణ ప్రాంత మంత్రులను డిమాండ్ చేశారు. జై తెలంగాణ నినాదాలతో దీక్షా శిబిరం మార్మోగింది. మంత్రులు మాట్లాడుతున్నపుడు కూడా కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి