ముంబయి: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. ముంబయి అంధేరి ప్రాంతంలోని ఓ విలాసవంతమైన ఆకాశ హర్మ్యంలో 8 ఫ్లాట్లు, 5 కారు పార్కింగ్ స్థలాల్ని జప్తు చేశారు. పాకిస్థాన్ జాతీయుడైన సమీ భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అనుమతి లేకుండా
ఈ ఆస్తులను కొనుగోలు చేసినందుకు రూ.20 లక్షల జరిమానా కూడా విధించారు. అద్నాన్ సమీ 'విదేశీ మారక నిర్వహణ, నియంత్రణ-2000' చట్టాన్ని ఉల్లంఘించారని ఈడీ అధికారులు తెలిపారు. ఈ చట్టం ప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, చైనా, ఇరాన్, నేపాల్, భూటాన్ దేశాల జాతీయులు భారత్లో ఎలాంటి స్థిరాస్తుల కొనుగోలు, బదిలీ చేయాలన్నా ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై సమీ న్యాయవాది వైభవ్కృష్ణ స్పందిస్తూ.. జప్తు ఆదేశాల కాపీని అందుకున్నామనీ, తాము ఫెమా అప్పిలేట్ ఫోరానికి వెళతామన్నారు. అద్నాన్సమీ 2003లో రూ.2.53 కోట్లు వెచ్చించి సమీ ఈ ఆస్తుల్ని కొనుగోలు చేశారు. అందులో అయిదు ఫ్లాట్లను దుబాయి జాతీయురాలైన తన భార్య సబా గలాదరికి బహుమానంగా ఇచ్చారు. ప్రస్తుతం వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి