న్యూఢిల్లీ: దాదాపు 372 సంవత్సరాల తరువాత సంపూర్ణ చంద్రగ్రహణం, దక్షిణాయనం (వింటర్ సోల్స్త్టెస్) ఒకేసారి మంగళవారం సంభవించబోతున్నాయి. చివరిసారిగా 1638, డిసెంబర్ 21న ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని అమెరికా నౌకాదళ అబ్జర్వేటరీకి చెందిన జెఫ్ చెస్టర్ తెలిపారు. ఈ చంద్రగ్రహణం భారత్లో దర్శనమివ్వదు. ఆ సమయంలో మనకు పగటి పూట కావడమే ఇందుకు కారణం.
ఈ పరిణామం ఐరోపా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియాలోని తూర్పు భాగం, ఫిలిప్పీన్స్, తూర్పు, ఉత్తర ఆసియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. దక్షిణాయనం కారణంగా ఉత్తరార్ధగోళంలో మంగళవారం పగటి సమయం తక్కువగా ఉంటుంది. భూమి అక్షంలో మార్పుల వల్లే ఇలా జరుగుతుంది. ఫలితంగా భూమి ఉత్తర ధ్రువం సూర్యుడికి దూరంగా జరుగుతుంది. దక్షిణ ధ్రువం సూర్యుడి వైపునకు ఒరుగుతుంది. ఫలితంగా ఉత్తరార్ధగోళానికి తక్కువ సూర్యకాంతి అందుతుంది. అదే సమయంలో దక్షిణార్ధగోళానికి ఎక్కువ సూర్యకాంతి లభిస్తుంది. ఫలితంగా అక్కడ పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. భారత కాలమానం ప్రకారం.. దక్షిణాయనం.. డిసెంబర్ 22న ఉదయం 5.08 గంటలకు సంభవిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మంగళవారం మధ్యాహ్నం 1.47గంటలకు చోటుచేసుకుంటుంది. మళ్లీ 2094, డిసెంబర్ 21న దక్షిణాయనం, సంపూర్ణ చంద్రగ్రహణం ఒకేసారి చోటుచేసుకుంటాయి. వచ్చే ఏడాది జూన్ 15న జరిగే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారత్ నుంచి వీక్షించొచ్చు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి