Loading...

15, డిసెంబర్ 2010, బుధవారం

సంక్షోభంలో వ్యవసాయం

హైదరాబాద్‌: వ్యవసాయం పండుగలా లేదని... సంక్షోభంలో ఉందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. ఈరోజు శాసనసభలో రైతు సమస్యలపై జరిగిన చర్చలో జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ ప్రతి రైతు కంట కన్నీరు, గుండెల్లో వేదన ఉందని చెప్పారు. వ్యవసాయం రంగం నుంచి రైతులు పారిపోవాలని కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 శాతం మంది రైతుల తలసరి ఆదాయం రూ. 15 వేలుగా ఉందని చెప్పారు. వ్యవసాయేతర రంగం వారి తలసరి ఆదాయం రైతుల తలసరి ఆదాయం కంటే 7 రెట్లు ఎక్కువగా ఉందని... ఈ అసమానత వచ్చే పదేళ్లల్లో 14 నుంచి 15 రెట్లకు పెరగవచ్చని
చెప్పారు. భారతదేశంలో గత పదేళ్లల్లో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసమానతలు దేశంలో సామజిక సంక్షోభం, రాజకీయ అస్థిరతలకు దారి తీయవచ్చని అభిప్రాయపడ్డారు. రైతుల ఉత్పత్తులు పక్కరాష్ట్రాల్లో అమ్ముకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఆంక్షలున్నాయన్నారు. పార్టీల దగాకోరు విధానాల వల్లే వ్యవసాయ రంగం ఇంత సంక్షోభంలోకి వెళ్లిందని అన్నారు. రైతును యూనిట్‌గా తీసుకొని పంటల బీమా అమలుచేయాలని కోరారు. పంట రుణం తీసుకుంటే బీమా కట్టాల్సిందేనన్న నిబంధన రద్దు చేయాలని అన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి