కోల్‌కతా: కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాల్లో మైనింగ్ మాఫియా పాల్పడుతున్న అక్రమాలను లఘుచిత్రం (డాక్యుమెంటరీ) రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చాడు ఓ సాహసికుడు. బళ్లారి బెల్ట్‌లో సాగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం, నిర్వాసితుల
సమస్యలు, బాల కార్మికుల దీనగాథలు కళ్లకు కట్టినట్లు అందులో ప్రదర్శించారు. 'బ్లడ్ అండ్ ఐరన్' పేరుతో తెరకెక్కిన ఈ లఘుచిత్రానికి పాత్రికేయుడు పరంజయ్ గుహ థాకుర్టా దర్శకత్వం వహించారు. ఆ ప్రాంతంలో ప్రజాధనాన్ని దోచుకోవడానికి రాజకీయ నాయకులు, నేరగాళ్లు, వ్యాపారవేత్తలు ఎలా కుమ్మక్కయ్యారో తెరకెక్కించినట్లు థాకుర్టా తెలిపారు. బళ్లారి, అనంతపురంలోని స్థానిక నాయకులను శక్తిమంతమైన మైనింగ్ మాఫియా ఎలా ప్రభావితం చేసిందో బ్లడ్ అండ్ ఐరన్‌లో చూడోచ్చు. పీటీఐ వార్తాసంస్థకు ఈమెయిల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఈ లఘుచిత్రం నిర్మాణానికి శాస్త్రవిజ్ఞానం, పర్యావరణ కేంద్రం(సీఎస్ఈ) ఆర్థిక సాయం చేసిందని థాకుర్టా తెలిపారు. ఢిల్లీలో జనవరి 6న విడుదల చేస్తారు. త్వరలో హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల్లోనూ ప్రదర్శించనున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి