Loading...

29, డిసెంబర్ 2010, బుధవారం

ధోనీ నివాసంలో దొంగతనం

రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నివాసంలో చోరీ జరిగింది. క్రిస్టమస్ పర్వదినం రాత్రి అత్యధునాతనమైన ఆ నివాసంలో దొంగతనం చోటు చేసుకుంది. ఈ విషయంపై రాంచీలోని అర్గోరా పోలీసు స్టేషనులో  ఫిర్యాదు నమోదైంది. ముసుగులు ధరించిన కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు
ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, భవనం వెనక అమర్చిన సిసిటివిని ఎత్తుకెళ్లారని ధోనీ సోదరుడు నరేంద్ర సింగ్ ధోనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు తామెవరం ఇంట్లో లేకపోవడంతో వెంటనే గుర్తించలేకపోయామని, తిరిగి వచ్చిన తర్వాత వీడియో ఫుటేజ్ చూడడంతో ఆ విషయం తెలిసిందని ఆయన చెప్పారు. తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ధోనీ నివాసానికి వచ్చి దొంగతనానికి పాల్పడినవారి ఉద్దేశం ఏమిటో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్ ఎస్పీ ప్రవీణ్ సింగ్ చెప్పారు. భద్రత కోసం నియోగించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి