Loading...

4, జనవరి 2011, మంగళవారం

పాపం "కొణ"తాల...

విశాఖపట్నం : జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభం రోజున మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు తీవ్ర పరాభవం ఎదురైంది. విమానాశ్రయం వద్ద స్వాగత కార్యక్రమాల్లో ఎంపీ సబ్బం హరి నిమగ్నం కాగా ఎన్ఎడీ జంక్షన్ వద్ద జరగనున్న బహిరంగసభ వేదిక వద్ద టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి,మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.విమానాశ్రయానికి చేరుకున్న జగన్ నిర్ణీత సమయానికే ఎన్ఎడీ జంక్షన్ వేదిక వద్దకు చేరుకున్నారు.
సబ్బం హరి, కొణతాల రామకృష్ణలతో కలిసి జగన్ తన తండ్రి వైఎస్ జగన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే విగ్రహం వద్దకు వెళ్లడానికి ఏర్పాటుచేసిన స్టాండ్‌పై నుంచి అంతా దిగిపోవాలని జగన్, హరి తదితరులు గట్టిగానే చెప్పారు. దీంతో ముందుగా బాబూరావు, ఆ తర్వాత కొణతాల రామకృష్ణలు మౌనంగా దిగి వేదికపై ఒక పక్కన నిల్చున్నారు. ఇక ఆ తర్వాత మాట్లాడిన ఎంపీ హరి కూడా కొణతాలను తిరిగి జగన్ వున్న స్టాండ్ వద్దకు పిలవలేదు. జగన్ కూడా కొణతాల విషయం ప్రస్తావించలేదు. ఇక ఆ తర్వాత ఓదార్పు జరిగిన పద్మనాభపురంలో కొణతాల కారుకే పరిమితమయ్యారు. తనకు సరిగా ప్రాధాన్యం లభించకపోవడంతో ఆ తర్వాత జరిగిన అప్పల నరసింహనగర్, వేపగుంట జంక్షన్ సభల్లోను కొణతాల ఎక్కడా వేదికలపై కానరాలేదు. ఓదార్పు ప్రారంభమైనప్పటి నుంచి హరి హడావుడే ఎక్కువ కనిపించింది. వేదిక పైకి ఎక్కి అందరినీ కిందకి దింపేయడం, జగన్‌కు జంక్షన్‌ల పేర్లు చెప్పి మాట్లాడించడం, ముందుగా కార్యకర్తలందరికీ తానే రెండు చేతులు ఊపి అభివాదం చేయడం కనిపించింది. ఒక్క వేపగుంట జంక్షన్‌లో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, జడ్పీ చైర్మన్ రామ్మూర్తినాయుడు వేదికపై కనిపించారు. జగన్ ప్రయాణించిన వాహనంలోనే హరి ఆశీనులై అన్ని ప్రాంతాలు పర్యటించారు. అయితే జిల్లానుంచి జగన్‌కు జనం మద్దతు కూడగట్టేందుకు కృషిచేసిన కొణతాల యాత్రలో జగన్ వెంట హరితోపాటు ముందుకు దూసుకువెళ్లలేకపోయారని ఆయన వర్గీయులు ఆవేదన వెలిబు చ్చారు. ఎంపి హరి, మాజీ మంత్రి కొణతాల ఎవరికివారే యము నా తీరన్నట్టుగా వ్యవహరించారు. విమానాశ్రయం నుంచి సింహాచలం వరకు జరిగిన ఏ సభలోను కొణతాల కనీసం మైకు పట్టుకోకపోవడం గమనార్హం. ఎన్ఏడీ జంక్షన్‌లో జరిగిన పరాభవం వల్లే కొణతాల తదుపరి సభల్లో వేదికపైకి రాలేదని పలువురు చర్చించుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా శొంఠ్యాం జంక్షన్‌లో జరిగిన బహిరంగసభలో కూడా కొణతాల ఎక్కడా కానరాలేదు. అయితే పెందుర్తిలో జరిగిన సభలో మాత్రం మాజీ మంత్రి కొణతాల వేదికపైకి రావాలని పలువురు అభిమానులు నినాదాలు చేశారు. దీంతో కొణతాల వేదికపైకి రాగా ముందుగా కొణతాల ప్రసంగిస్తారని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ప్రకటించారు. అయినప్పటికీ కొణతాల మాత్రం మాట్లాడకుండానే మౌనం దాల్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి