Loading...

4, జనవరి 2011, మంగళవారం

సూరి హత్యకు పథక రచన చేసింది ఇద్దరు ?

హైదరాబాద్, జనవరి 4: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూరి హత్య కేసులో పోలీసులకు అనూహ్యమైన కోణాలు ఎదురవుతున్నాయి. హత్య జరిగిన వెంటనే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పోలీసులు చేసిన దర్యాప్తులో ముందు భాను అనే అనుచరుడు ఒక్కడిపైనే అనుమానాలు వచ్చాయి.
ఇప్పుడు మరో అనుచరుడు మధును సైతం పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం 12 పోలీసు బృందాలు ఈ హత్య కేసును ఛేదించడంలో తలమున్కలై ఉన్నాయి. సూరి దారుణ హత్య జరిగిన అనంతరం డ్రైవర్ స్థానంలో ఉన్న అనుచరుడు మధు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ప్రాథమిక దర్యాప్తు కొనసాగించారు. అయితే అందులో కొన్ని సమాధానాలు దొరకని అనేక ప్రశ్నలు తలెత్తడంతో అప్పటివరకూ అనుమానిస్తున్న భానుతో పాటు సంఘటన జరిగినప్పుడు కారు నడుపుతున్న మరో అనుచరుడు మధు కూడా అనుమానితుడేనని, బహుశ ఇద్దరూ కలిసే ఈ హత్యకు వ్యూహరచన చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సూరికి కుడి భుజంగా చెప్పే భాను, ఎడమ భుజంగా చెప్పే మధుతో పాటు సూరితో చాలా సన్నిహితంగా మెలిగే అనుచరులు ప్రసాద్, వాసులను కూడా హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సి.సి.ఎస్.) పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తున్నది. అయితే భాను తమ అదుపులో లేడని పోలీసులు అధికారికంగా పేర్కొన్నారు. ఈ హత్య కేసులో ఒక మంత్రి కుమారుని పేరు కూడా తెర పైకి వస్తున్నది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ యువకునికి భానుతో సన్నిహిత సంబంధం ఉన్నట్టు తెలుస్తున్నది. హత్యకు వినియోగించిన తుపాకి లైసెన్సు ఖమ్మంలో మంజూరు అయినట్టు తెలుస్తున్నది. లైసెన్సు రెన్యూవల్ చేయించడంలో ఈ యువకుని పాత్ర ఏమిటన్న అంశంపై కూడా పోలీసులు దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. సూరి దారుణ హత్యకు ముందు వీరంతా సెల్ ఫోన్‌లలో ఎవరితో ఏమి మాట్లాడారన్న అంశాన్ని ఆధారం చేసుకుని పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి