Loading...

26, జనవరి 2011, బుధవారం

వెలుగుల కేంద్రం... ఎన్టీపీసీ

విశాఖపట్నం: పారిశ్రామికంగా తన ప్రాముఖ్యతను నిలబెట్టుకుంటూనే వెలుగులు విరజిమ్మే పరిశ్రమ- సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్తు సంస్థ (ఎన్‌.టి.పి.సి.)నూ సొంతం చేసుకుంది. పరవాడ వద్ద ఏర్పాటైన ఈ పరిశ్రమ తొలి దశలోనే వెయ్యి మెగావాట్లను ఉత్పత్తి చేస్తూ వస్తుండగా రెండో దశ విస్తరణ ఇప్పుడు పూర్తి చేసుకుంటోంది.
తద్వారా దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్తు వెలుగుల్ని ప్రసరింపజేసేందుకు సమాయత్తమవుతోంది. తొలి దశలో ఉత్పత్తి అవుతున్న వెయ్యి (500X2) మెగావాట్లను రాష్ట్ర అవసరాల కోసమే కేటాయిస్తుండగా రెండో దశలో రాబోతున్న వెయ్యి (500X2) మెగావాట్లలో 25 శాతాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించనున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరిలకు మిగిలిన 75% విద్యుత్తును సర్దుబాటు చేస్తారు. 500 మెగావాట్ల యూనిట్లలో ఒకటి 2011 మార్చి లోగానే తయారవుతుంది. రెండోది మాత్రం 2011-12 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వస్తుంది. తీరప్రాంతంలో ఏర్పాటైన మొట్టమొదటి బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కర్మాగారంగానే కాకుండా తొలిదశలోనే అనేక ప్రత్యేకతలను సింహాద్రి సొంతం చేసుకొంది. దానికి కొనసాగింపుగా ఉండేలా మలిదశ పనుల్లోనూ పలు చర్యలు తీసుకుంటున్నారు. సముద్రపు నీటిని నేరుగా తీసుకునేందుకు బంగాళాఖాతంలో నిర్మించిన బావి (ఇన్‌టేక్‌ వెల్‌) దేశంలోనే అతి పెద్దది కాగా, 165 మీటర్ల ఎత్తు ఉండే కూలింగ్‌ టవర్లు ఆసియాలో మొదటిస్థానాన్ని పొందాయి. పూడిమడక సమీపంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో మరో విద్యుదుత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని 'జాతీయ థర్మల్‌ విద్యుత్‌ సంస్థ' (ఎన్‌.టి.పి.సి.) నిర్ణయించడం, దానిలో 50 శాతాన్ని మన రాష్ట్రానికే కేటాయించడం తెలిసిందే. భూములు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చి విద్యుత్తు కేటాయింపులపై ఇటీవలే ఒప్పందం చేసుకుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి