Loading...

22, జనవరి 2011, శనివారం

జగన్‌ నీతి మాటలు వల్లించడం విడ్డూరంగా ఉంది

- శాసనమండలి ప్రతిపక్ష నేత దాడి
అనకాపల్లి : 'పెట్రో, నిత్యావసర సరుకుల ధరల పెంపులో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి పాత్రలేదా'ని శాసనమండలి ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు, మాజీ ఎంపీ జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.
విశాఖ జిల్లా అనకాపల్లి తెదేపా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో 19 సార్లు కేంద్రం పెట్రో ధరలు పెంచితే, వైఎస్‌ హయాంలోనే 15 సార్లు పెరిగాయన్నారు. ఈ పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్‌ ఒక్కనాడైనా ప్రకటన చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక పన్నులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినా ఇక్కడ అమలుకాలేదన్నారు. వైఎస్‌ హయాంలోనే నిత్యావసర సరుకుల ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా పెరిగాయన్నారు. ధరల పెరుగుదలను అరికట్టమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిని ప్రశ్నిస్తే ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగిందని, ధరలు తగ్గించాల్సిన అవసరం లేదని చెప్పారని గుర్తుచేశారు. ఆయన కుమారుడు జగన్‌కు ఈ విషయాలు గుర్తులేవా అని నిలదీసారు. ఆనాడు ధరల పెరుగుదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే జగన్‌ బెంగళూర్‌లో ఉంటూ తన తండ్రి పంపిన డబ్బు సంచులను లెక్కపెట్టుకోవడంలోనే నిమగ్నమయ్యే వారని దుయ్యబట్టారు. ధరల పెంపును అరికట్టాలని ఏనాడు తన తండ్రికి సలహా ఇవ్వని జగన్‌, ఈ పెరుగుదలతో తన కుటుంబానికి సంబంధం లేదన్నట్లుగా నటిస్తూ దీక్షలతో నేడు ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. విశాఖలో ధరల పెరుగుదలను నిరసిస్తూ దీక్ష చేయడం హాస్యాస్పదం అన్నారు. వైఎస్‌ పాలనలో ఆయన కుటుంబ సభ్యులు రూ. కోట్లు గడించారన్నారు. రైతుల భూములు లాక్కొని పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టి వారిని నడివీధిలో నిలబెట్టినప్పుడు ఆరేళ్లు నోరు మెదపని జగన్‌ ఈ వేళ ప్రజా సంక్షేమమనే నీతి మాటలు వల్లించడం విడ్డూరంగా ఉందని దాడి ఎద్దేవా చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి