Loading...

30, నవంబర్ 2012, శుక్రవారం

బెయిల్ కోసం 11 కిలోల బంగారం 3కోట్లకు అమ్మిన గాలి

హైదరాబాద్: కర్నాటక మాజీమంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కోసం తన బంగారాన్ని అమ్మారట. గాలికి బెయిల్ తీసుకు వచ్చేందుకు ఆయన వర్గం జడ్జిలు, ఇతరులతో బేరాలు కుదుర్చుకున్నట్లుగా, దాదాపు పదికోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా ఎసిబి గుర్తించిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఎసిబి ఆరా తీస్తే... డబ్బు కోసం గాలి బంగారం అమ్మినట్లుగా గుర్తించిందట.

దాదాపు మూడు కోట్ల రూపాయలు సేకరించేందుకు గాలి అనుచరులు బంగారం అమ్మినట్లుగా తెలుస్తోంది. గురువారం ఎసిబి కోర్టులో ఈ కేసులో అదనపు ఛార్జీషీటు దాఖలు చేసింది. దీంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన గాలి జనార్ధన్ రెడ్డి తనను కలిసేందుకు అనుచరులు, సోదరులు వచ్చినప్పుడు బెయిల్ డీల్ ప్రణాళిక రచించారు. జడ్జీలకు, మధ్యవర్తిగా ఉన్న రౌడీ షీటర్‌కు కలిపి రూ.9.5 కోట్లను ముందుగా ముట్టజెప్పారు.
అయితే అంత డబ్బు అందుబాటులో లేకపోవడంతో.. గాలి ఇంట్లో ఉన్న పదకొండు కిలోల బంగారాన్ని అమ్మి మొత్తాన్ని సమకూర్చాలని భావించింది. దీంతో సురేష్ బాబు తనకు తెలిసిన నగల వ్యాపారి ద్వారా బంగారాన్ని అమ్మాడు. ఓ వ్యాపారి 6 కేజీల బంగారాన్ని కొనడానికి వారు ఒప్పుకొన్నారు. కిలో బంగారం ధర రూ.29 లక్షల 17 వేలుగా నిర్ణయించారు. ఆరు కిలోల బంగారం అమ్మడంతో కోటి 75 లక్షలకు వచ్చాయి.
మిగిలిన ఐదు కిలోల బంగారాన్ని మరో వ్యాపారికి రూ.కోటి 40 లక్షలకు విక్రయించారు. గాలికి బెయిల్ వచ్చిన మే 11న ఓ హోటల్‌కు ఈ డబ్బును తరలించారు. బంగారం అమ్మకం, కొనుగోలులో పాలుపంచుకున్న వారంతా ఎసిబి అధికారులకు ఈ వాంగ్మూలం ఇచ్చారు. కాగా ఆరు కిలోల బంగారాన్ని పాతబస్తీలోని మనోకామ్న, ఐదు కిలోల బంగారం హిమయత్ నగర్‌లోని ప్రమోద్ బంగకు విక్రయించారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి