Loading...

27, నవంబర్ 2012, మంగళవారం

జైలులో జగన్ ఆర్నెల్లుగా...: అంతా తలకిందులు

హైదరాబాద్: ఒకే ఒక్క మాట మూడేళ్ల కిందట సంచలనానికి దారి తీసిందంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రికలో మంగళవారం కథనం వచ్చింది. జగన్‌ను అరెస్టు చేసి ఆర్నెల్లు.. శీర్షికతో ఇచ్చిన మాటకోసమే అంటూ ఓ కథనం ప్రచురించింది. వైయస్ మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారిని ఓదారుస్తానని నల్లకాలువ సాక్షిగా జగన్ ప్రకటించారని చెప్పారు....

అయితే ఓధార్పు చేయవద్దని అత్యున్నత అధికార పీఠం శాసించిందని, ఆజ్ఞ జవదాటితే కష్టాలు తప్పవని సంకేతాలివ్వడం.. ఇచ్చిన మాట కోసం జగన్ ముందుకే నడిచారని రాసింది. జగన్‌ను జైలులో పెట్టి నేటికి ఆరు నెలలు, ఆరు నెలల్లో మాటే మంత్రమైందని రాసింది. జగన్ విశ్వసనీయత ఇప్పుడు రాజకీయాల్లో గీటురాయిగా మిగిలిందని, వైయస్ వల్లే కేంద్రంలో రెండోసారి పదవీ వైభోగాలను అనుభవిస్తున్నామన్న ఇంగిత జ్ఞానం ఢిల్లీ పెద్దలకు లేకపోయినా.. ఆయన వల్లే తమకు పదవులొచ్చాయని ఇక్కడి నాయకులు మరిచినా ప్రజలు మాత్రం మర్చిపోలేదంది.
ఇచ్చిన మాట కోసం జగన్ ఎదుర్కొంటున్న వేధింపులను ప్రజలు చూస్తున్నారన్నారు. జగన్ ఒక్కడినే అందరూ లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించింది. జగన్ పైనున్న ప్రజాభిమానం తగ్గించేందుకు వివిధ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవన్నారు. సర్వే సంస్థలన్నీ జగన్ పార్టీ విజయాలనే చెబుతున్నాయన్నారు. జగన్‌ను జైలులో పెట్టినవారి ఆశలు తలకిందులయ్యాయన్నారు.
ఇచ్చిన మాట కోసం కట్టుబడితే దేన్నయినా ఎదిరించే సాహసాన్ని ప్రదర్శిస్తే పదవులను తిరస్కరిస్తే ప్రజలు తమ వాడిగా గుర్తిస్తారని జగన్ రుజువు చేశారని రాసింది. జగన్ ఇచ్చిన మాట కోసం ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా ఓదార్పు చేపట్టారని, ఆ తర్వాత జగన్‌కు పర్యాయపదం జనం అయిందన్నారు. ఇది ఢిల్లీ వెన్నులో వణుకు పుట్టించిందని, వెంటనే జగన్‌ను దెబ్బతీసేందుకు ప్రణాళికలు రచించారని రాసింది.
జగన్‌ను దెబ్బతీసేందుకు మొదట ఐటి నోటీసుల రూపంలో బెదిరింపులు, ఆ తర్వాత శంకర రావు హైకోర్టుకు లేఖ, జతగా టిడిపి కలవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయని రాసింది. కేసు గురించి హైకోర్టు ప్రశ్నించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా మౌనం పాటించిందని, కౌంటర్ దాఖలు చేయలేదని రాసింది.
హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించాక కేంద్రం పావులు కదిపిందని, సిబిఐ దర్యాఫ్తు అంతా దాని కనుసన్నుల్లోనే నడుస్తోందని, జీవోల జారీ ప్రక్రియలో అవకతవకలు జరిగితే అధికారులు, మంత్రులను మొదట తప్పుపట్టకుండా జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిని వేధించడం ప్రారంభించారని, అరెస్టులు చేశారని, సాక్షి గొంతు నొక్కాలని చూశారని, ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో జగన్ మరో మూడు రోజుల్లో కోర్టు ముందు హాజరు కాబోతున్న సమయంలో అతన్ని అరెస్టు చేశారని రాశారు.
ఆ తర్వాత జగన్‌కు బెయిల్ రావాల్సిన ప్రతి సందర్భంలో న్యాయస్థానాలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించింది. చివరికు మొన్న సుప్రీం కోర్టులో జగన్ కు బెయిల్ రావడం ఖాయమని రాష్ట్ర ప్రజలు భావిస్తున్న సమయంలో టిడిపి ఎంపీలు చిదంబరంను కలవడం, వెంటనే ఈడిని ఉసిగొల్పడం రాష్ట్ర ప్రజలు గమనించారని, అయితే అన్ని కుట్రలు భగ్నమవుతాయని, చరిత్రే ప్రత్యక్ష సాక్షమని, ఇది పదే పదే నిరూపణ అవుతున్న సత్యమని ముగించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి