Loading...

30, నవంబర్ 2012, శుక్రవారం

క్రైసిస్: టెక్కీల జీవితాల్లో ఎందుకీ ట్రాజెడీలు?

హైదరాబాద్: టెక్కీల జీవితాలు ఎందుకు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. దేశంలో కాసుల వేట సాగిస్తున్న టెక్కీల విషయంలోనే కాకుండా డాలర్ల వేటలో విదేశాలకు వెళ్లిన టెక్కీల జీవితాలు కూడా కత్తి మీద సాములా ఉన్నట్లు కనిపిస్తోంది. లక్షల్లో జీతాలు, అయినా నిరాశ, నిస్పృహ ఎందుకు అనేది ప్రశ్నగా మారింది.

అయితే, అధిక మొత్తంలో జీతాలు పొందుతుండడం వల్ల ఆ సాఫ్ట్‌వేర్ రంగంలో జరుగుతున్న సంఘటనలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయా అనేది కూడా ప్రశ్నే. అయితే, గత కొద్ది కాలంలో సాఫ్ట్‌వేర్ రంగం విస్తరించడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆర్థికంగా సంపన్న కుటుంబాలుగా మారిపోయాయి. అయితే, జీవితాలు మాత్రం సాఫీగా సాగుతున్నట్లు కనిపించడం లేదు. హైదరాబాద్‌లో నీలిమ ఇన్ఫోసిస్ కార్యాలయం నుంచి దూకి మరణించిన సంఘటన, తమిళనాడు రాజధాని చెన్నైలో నళిని అనే టెక్కీ భవనంపై నుంచి దూకి మరణించిన సంఘటన సమాజాన్ని పునరాలోచలో పడేసినట్లు కనిపిస్తోంది.
ప్రేమ వైఫల్యాలు, జీవితాల పట్ల ఆసంతృప్తి, ఆర్థిక వివాదాలు, కొత్త ఆకర్షణలు, తమకు కావాల్సిన సంబంధాలను అందుకోలేని నిస్సహాత - ఇలా పలు సమస్యలు వారిని వేధిస్తున్నాయి. వాటిని తట్టుకునే మానసిక స్థైయిర్యాన్ని అందించలేని చదువులు.. సామాజిక అవగాహన లేకపోవడం.. కొత్త సంబంధాలకు తలుపులు తెరుచుకోవడం... వాటిని అందుకోవాలో అందుకోకూడదో తెలియని అయోమయ స్థితి... ఇలా అన్నీ వారి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోవడానికి కారణమవుతున్నాయి. మగవాళ్లు కావచ్చు, ఆడవాళ్లు కావచ్చు... జీతాలు ఎక్కువే ఉన్నా, ఉద్యోగ భద్రత మాత్రం అంతగా కనిపించని లోపలి వ్యవహారం ఒకటి వెంటాడుతూనే ఉంటుంది.
ఇటీవల మహిళా టెక్కీని భర్తే స్వయంగా కత్తితో 11 సార్లు పొడిచి చంపిన సంఘటన ఇటీవల బెంగళూర్‌లో జరిగింది. బెంగళూర్‌లోని మరాఠాహల్లిలోని వారి నివాసంలో నవంబర్ రెండో వారంలో ఈ సంఘటన జరిగింది. తనకు ఇల్లు కొనుక్కోవడానికి ఆర్థికంగా సహకరించడం లేదనే కోపంతో భర్త సంజయ్ చౌదరి భార్య రుచిని హత్య చేశాడు. భార్యను చంపడానికి ఢిల్లీ నుంచి బెంగళూర్‌కు విమానమంలో వచ్చాడు.
తమిళనాడు రాజధాని చెన్నైలోని కార్యాలయం భవనం ఆరో అంతస్థు నుంచి దూకి మహిళా టెక్కీ నళిని ఆత్మహత్య చేసుకుంది. టెక్కీ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వరకట్నం వేధింపులు భరించలేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చెన్నైలోని తాంబారంలో తన కార్యాలయ భవనంపై నుంచి దూకి నళిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నవంబర్ మొదటివారంలో రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో జరిగింది.
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుమిత్ పరిహార్‌ హర్యానాలోని హోడల్ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై 26 ఏళ్ల సుమిత్ పరిహార్ శవమై తేలాడు. ఇది ఆత్మహత్యకు సంబంధించిన కేసు కావచ్చునని అనుమానించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో అనిరుధ్ షెకావత్ (23) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరణించాడు. అతడ్ని న్యూఢిల్లీకి చెందిన అనిరుధ్ షెకావత్ (23)గా గుర్తించారు. అతను గూగుల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ మరణించాడు.
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికా నుంచి వచ్చి హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలోని సాన్ డీగో నుంచి అతను సెప్టెంబర్ మొదటివారంలో హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన 30 ఏళ్ల టెక్కీ క్యాబ్‌ను అద్దెకు తీసుకుని అందులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. టెక్కీ అనిల్ కుమార్ జేబులో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. వివాహ సంబంధమైన సమస్యల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసి ఉంది.
హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ భవనం నుండి దూకి టెక్కీ నీలిమ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనమే సృష్టించింది. భర్తతో భేదాభిప్రాయాలు, అమెరికా నుండి ఆమె పంపిన రూ.25 లక్షల వ్యవహారం, హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె బేలగా మారి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు. హైదరాబాద్ వచ్చాక ఈ డబ్బు విషయమై భర్తతో మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరిగింది.
ప్రేమించిన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత మోసం చేయడంతో ఓ టెక్కీ ప్రియుడు హైదరాబాదులో నడుపుతున్న కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆ మధ్య చోటు చేసుకుంది. టెక్కీ విశాలిని ఎస్ఆర్ నగర్‌ - బల్కంపేటలోని తన ప్రియుడి ఆఫీస్‌లో ఉరి వేసుకొని మృతి చెందింది. ఇరవయ్యేడేళ్ల విశాలిని గోషామహల్‌లోని హిందీ నగర్‌లో ఉంటోంది.
కర్ణాటక రాజధాని బెంగళూర్‌కు చెందిన 26 ఏళ్ల టెక్కీ పవన్ కుమార్ అంజయ్య అమెరికాలో మరణించాడు. కంపెనీ అసైన్‌మెంట్‌పై అమెరికా వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ న్యూజెర్సీలోని హోటల్ గదిలోఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. అమెరికాలోని హోటల్ గదిలో మత్తుపదార్థాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మరణించినట్లు అనుమానిస్తున్నారు.
తాజాగా చెన్నైలో రామచంద్రన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే రామలక్ష్మి అనే పాతికేళ్ల సీనియర్ అనలిస్టు స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆర్ నళిని అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నవంబర్ 6వ తేదీన కార్యాలయ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే, పలు సంఘటనలు ఉంటాయి. సమాజం వారికి భరోసాను ఇవ్వలేని స్థితిలో ఉందా అనేది అనుమానం. వారికి సామాజిక సంబంధమైన అవగాహన, మానవ సంబంధాలకు సంబంధిచంిన ఎరుక లేకపోవడం కూడా ఈ స్థితికి కారణం కావచ్చునని అంటున్నారు. లోకమంతా పచ్చగా ఉండదనే విషయాన్ని, జీవితంలో పచ్చదనాన్ని నింపుకోవడానికి పరిస్థితిని ఉన్నదున్నట్లు స్వీకరించాలనే చైతన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు. జీవితాల్లో వ్యక్తిగత సమస్యలు, ఘర్షణలు అనివార్యమనే అనుభవాన్ని కూడా ఇవ్వాల్సే ఉంటుందని చెబుతున్నారు. కేవలం డబ్బులు తప్ప మరోటి లేదనే దృష్టి పెద్ద సమస్యగా మారిందనే అభిప్రాయం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి