Loading...

14, డిసెంబర్ 2012, శుక్రవారం

తెలుగు మహాసభలకు 4,500 మంది కళాకారులు

మండలి బుద్ధప్రసాద్‌ వెల్లడి
అవనిగడ్డ: తిరుపతి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈనెల 27వ తేది నుంచి నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు 1500 మంది జానపద కళాకారులు, 3 వేల మంది ఇతర కళాకారులు పాల్గొంటున్నారని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని తన
కార్యాలయంలో గురువారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. సభల్లో 174 మంది కవులు పాల్గొంటారని, 500 మందికి సన్మానాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీరందరికి రవాణా, భోజన, వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. రూ.500 డెలిగేట్‌ ఫీజు చెల్లించి 5 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని, విదేశాల నుంచి మంచి స్పందన లభించినట్లు వివరించారు. భావితరాలకు భాషపై అభిమానం, మక్కువ కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పలు భాషలు మృతభాషలు అవుతాయని యునెస్కో చెప్పిన నేపథ్యంలో తెలుగు భాషా, సంస్కృతులను పరిరక్షించుకోవడానికి ప్రపంచ తెలుగు మహాసభలు దోహదపడతాయని వివరించారు. ఈసందర్భంగా గత నెల రోజులుగా వివిధ జిల్లాలు, మండలాలు, గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమాలకు అపూర్వ స్పందన లభించిందని, వేలాది మంది బాలలు వారిలోని సృజనాత్మక శక్తిని ప్రదర్శించారని, సదస్సు లక్ష్యం నెరవేరిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సభలలో పాల్గొని నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలని బాషాభిమానులను కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి