Loading...

29, డిసెంబర్ 2012, శనివారం

624 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు

విశాఖపట్నం, డిసెంబరు 28(చైతన్యవారధి): డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులను ఉపాధ్యాయ పోస్టుల్లో నియమించడానికి రెండో రోజు శుక్రవారం సీతమ్మధార ఎన్‌.ఎం.సి.హెచ్‌ స్కూలులో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మొత్తం 624 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించారు. మైదాన ప్రాంతంలో 480 ఖాళీలకుగాను 396, ఏజెన్సీ
ప్రాంతంలో 373 ఖాళీలకుగాను 214 భర్తీ అయ్యాయి. ఆంగ్ల మాధ్యమంలో 14 పోస్టులుండగా అన్నిటినీ భర్తీ చేశారు. మొత్తం 867 పోస్టులకు గాను 624 మంది ఉద్యోగాలు పొందారు. అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో మైదాన ప్రాంతంలో 84, గిరిజన ప్రాంతంలో 159 మొత్తం 243 పోస్టుల్ని బ్యాక్‌లాగ్‌లో పెట్టారు. రోస్టర్‌ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు లేకపోవడంతో ఇవి ఖాళీగా మిగిలిపోయాయి.ఎస్జీటీ అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. కొన్ని మండలాల నుంచి వచ్చిన అభ్యర్థులు కలెక్టర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. నర్సీపట్నం, కోటవురట్ల తదితర ప్రాంతాలకు చెందిన కొంత మంది గగ్గోలు పెడుతున్నారు. ఎక్కువ మార్కులు వచ్చిన వారు కోరుకున్నట్లుగాక ఏజెన్సీ ప్రాంతాల వారికి నగర పరిధిలో, అలాగే నగర పరిధిలో వారికి జీవీఎంసీ పాఠశాలల్లో అవకాశం కల్పించారని ఆరోపించారు. డీఈవో కృష్ణవేణి వివరణ ఇస్తూ రోస్టర్‌ పద్ధతి ప్రకారం ఉద్యోగ అవకాశం కల్పించామని తెలిపారు. కౌన్సెలింగ్‌లో ఏజేసీ నర్సింగరావు, జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి, ఉప విద్యా శాఖాధికారులు సి.వి.రేణుక, మధుసూదనరావు, లింగేశ్వరరెడ్డి, డీఐ వి.వి.రమణ సిబ్బంది పాల్గొన్నారు.

రద్దయిన ఎస్టీలకు కౌన్సెలింగ్‌
సెకండరీ గ్రేడ్‌ అభ్యర్థుల రోస్టర్‌లో ఇబ్బందులు రావడంతో కౌన్సిలింగ్‌ను గురువారం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అందరూ ప్రభుత్వ యాజమాన్యాలకు కోరుకోవడంతో జీవీఎంసీలో పోస్టులు మిగిలిపోయాయి. 269 ఎస్జీటీ పోస్టుల భర్తీకిగాను శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇందులో 190 మందిని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో నియమించారు. మిగిలిన 79 పోస్టులను జీవీఎంసీ, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీ పాఠశాలల్లో భర్తీ చేయడానికి కేటాయించారు.

సబ్జెక్టు వారీగా...
మైదాన ప్రాంతానికి సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌స్థాయిలో 13 ఖాళీల్ని శుక్రవారం భర్తీ చేశారు. హిందీ-25, తెలుగు-2, సెంకడరీ గ్రేడ్‌ స్థాయిలో తెలుగు-13, హిందీ-24, ఎస్జీటీలు -269 పోస్టులు భర్తీ అయ్యాయి. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌ హిందీ-3, తెలుగు-2, హిందీ-3, పీఈటీ-1, ఎస్జీటీ- 196 పోస్టులు భర్తీ చేశారు. రెండు రోజులుగా కౌన్సెలింగ్‌ నిర్వహించిన అభ్యర్థులకు శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి