Loading...

12, డిసెంబర్ 2012, బుధవారం

కాలేయ మార్పిడిలో 'గ్లోబల్‌' మైలురాయి

200 శస్త్ర చికిత్సలు పూర్తి
 హైదరాబాద్‌: మన రాష్ట్రంలోనే తొలిసారిగా 200 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించిన ఘనతను హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌ గ్లోబల్‌ ఆసుపత్రి సొంతం చేసుకుంది. మంగళవారం 201వ శస్త్ర చికిత్స చేసిన సందర్భంగా ఆసుపత్రి సీఎండీ డాక్టర్‌ రవీంద్రనాథ్‌, వైద్య నిపుణులు డాక్టర్‌ మహ్మద్‌ రేలా, థర్మేష్‌కపూర్‌
విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కాలేయ మార్పిడి చేయకుంటే మరికొద్ది గంటల్లో మరణించే స్థితిలో ఉన్న 36 ఏళ్ల మహిళకు గత ఆదివారం శస్త్ర చికిత్స చేశామని, దీంతో వీటి సంఖ్య 200కు చేరుకుందని తెలిపారు. దేశంలో కాలేయ మార్పిడి చికిత్సలతో పాటు కేంద్రాల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరముందన్నారు. అందుకే ముంబయిలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాది నుంచి శస్త్ర చికిత్సలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. కాలేయ మార్పిడిపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బంధువులు, కుటుంబ సభ్యులు కాలేయాన్ని దానం చేయటం ద్వారానే 150 మార్పిడి శస్త్రచికిత్సలు చేశామని, కేవలం 50 మాత్రమే జీవన్మృతుల (కెడావర్‌) నుంచి సేకరించి చేశామని తెలిపారు. విదేశాల్లో నూటికి 90 శాతానికి పైగా జీవనృతుల నుంచే కాలేయాన్ని సేకరిస్తున్నారని వివరించారు. మనదేశంలో ప్రతి పది లక్షల జనాభాలో ఏడాదికి 20 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు అవసరమవుతుండగా.. కేవలం 10 మాత్రమే జరుగుతున్నాయని వెల్లడించారు. జీవన్మృతుల నుంచి కాలేయాలను సేకరించటం ద్వారానే ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. అవయవ దానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సల సంఖ్య పెరిగితే వ్యయం కూడా తగ్గుతుందన్నారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు లండన్‌లో ఇతర దేశాలకు చెందిన వారికి రూ.కోటి వరకు ఖర్చవుతోందని తెలిపారు. అమెరికాలో రూ.2 కోట్లు, సింగపూర్‌లో రూ.80 లక్షల వరకు ఖర్చవుతోందన్నారు. మన దేశంలో మాత్రం ప్రస్తుతం రూ.20 లక్షల వరకు వ్యయమవుతోందని, శస్త్ర చికిత్సల సంఖ్య పెరిగితే రూ.15 లక్షలకే పూర్తయ్యే అవకాశముందని వివరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి