Loading...

28, డిసెంబర్ 2012, శుక్రవారం

ఉక్కు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి

గాజువాక, డిసెంబరు ౨౭(చైతన్యవారధి): ఉపాధికోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని, విశాఖఉక్కులో నిర్వాసితులకు తాను పూర్తి అండగా ఉంటానని కేంద్రమంత్రి డి.పురందేశ్వరి హామీ ఇచ్చారు.త్వరలోనే ఉక్కు సీఎండీతో సమావేశం ఏర్పాటుచేసి పెండింగ్‌ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గాజువాక
జోనల్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం మండలంలోని 37మంది లబ్ధిదారులకు రూ.5వేలు చొప్పున ఎన్‌ఎఫ్‌బీఎస్‌ చెక్కులు, సీఎంఆర్‌ఎఫ్‌ కింద మరో లబ్ధిదారునికి రూ.20వేలు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఉక్కునిర్వాసితుల నుద్దేశించి మంత్రి మాట్లాడారు. మూడు దశాబ్ధాలుగా నిర్వాసితులు ఉపాధికోసం ఆందోళన సాగిస్తున్నారని, ఇన్నాళ్లూ న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. తన దృష్టికి గాజువాక ఎమ్మెల్యే వెంకట్రామయ్య ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకొస్తున్నారని, పని ఒత్తిడి దృష్ట్యా తగిన న్యాయం చేయలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. ఉక్కును ప్రయివేటీకరించే ప్రసక్తేలేదని, ఈమేరకు ప్రధానమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నిర్వాసితులకు ఉద్యోగాలు, ఆర్ధిక ప్రయోజనాలు కల్పించడంలో తాను ముందుంటానని హామీ ఇచ్చారు.బీహెచ్‌పీవీ, జింక్‌ సమస్యలపై ప్రస్తావిస్తూ ఇప్పటికే కేంద్ర స్థాయిలో ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించడానికి ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. తుపాను కారణంగా గాజువాకకు జరిగిన నష్టంపై అధికారులతో మాట్లాడానని, నిధుల మంజూరుకు ప్రభుత్వాన్ని ఒప్పించనున్నానన్నారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్నాని చెప్పారు. సభకు ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఉక్కులో నిర్వాసితులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రస్ధాయిలో మంత్రి ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి నిర్వాసితుల ఉపాధికి శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. గాజువాక హౌస్‌కమిటీ భూముల సమస్య, బీహెచ్‌పీవీ, జింక్‌ కార్మికులకు జరిగిన అన్యాయంపై స్పందించాలన్నారు. తుంగ్లాంగేటు తెరిపించడం, ఏపీఐఐసీ నిర్వాసితులకు స్థలాల కేటాయింపులో శ్రద్ధచూపాలని కోరారు. తుపాను నష్టాలను భర్తీచేయడానికి నిధులు మంజూరు చేయాలని సూచించారు. గాజువాక తహసిల్దార్‌ సింహాద్రిరావు, జోనల్‌ ఇ.ఇ.కోటేశ్వరరావు పాల్గొన్నారు. నిర్వాసిత సంఘం జేఏసీ సభ్యుడు గొందేశి సత్యారావు మాట్లాడుతూ ఎన్ని ఆందోళనలు చేస్తున్నా ఉక్కు యాజమాన్యం స్పందించడంలేదని, కేంద్రమంత్రి చొరవతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అఖిలపక్ష నాయకులు పులి అప్పలరెడ్డి, రమణారెడ్డి, గంట్యాడ గోవింద్‌, కరణం కనకారావు, మంత్రిశంకర్‌, అస్మత్‌అలీ, ఇల్లపురాము, శ్రీను, రోహిణి, చొక్కాసూరిబాబు, మూర్తి, గుర్నాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమస్యలపై మంత్రికి వినతులు అందజేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి