Loading...

20, డిసెంబర్ 2012, గురువారం

గిరిజనులకు వరాల జల్లు

 -జిల్లాలో ముగిసిన ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట
పాడేరు, చైతనవారధి: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పాడేరులో పర్యటించిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గిరిజనులకు వరాల జల్లు కురిపించారు. పాడేరు హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం ముందుగా పాడేరు మెయిన్‌ రోడ్డులో రూ.16 లక్షలతో నిర్మించిన సూపర్‌ బజార్‌ను ప్రారంభించారు. తన సొంత డబ్బులతో ఆరు తేనె సీసాలను కొనుగోలు
చేసి శాసన సభ్యులకు పంపిణీ చేశారు. అనంతరం రేట్ల వివరాలు తెలుసుకున్నారు. నేరుగా దాలిమ్మపుట్టు చేరుకున్న ఆయన గిరిజన లబ్ధిదారులతో మమేకమయ్యారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. రూ. 50 లక్షలతో నిర్మించిన 'రూపాంతర్‌' అదనపు భవనాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి జూనియర్‌ కళాశాల సభా వేదికకు చేరుకున్న ఆయన గిరిజనాభివృద్ధిపై మాట్లాడారు. జిల్లాలో తక్కువ జనాభా కలిగిన గ్రామాలకు రూ.1322 కోట్లతో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద రహదారులు నిర్మిస్తామని ప్రకటించారు. ఎస్టీ విద్యార్థులకు బీఈడీ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, ఐటీఐలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి గర్భిణికి పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో 'అమృత హస్తం' పథకాన్ని ప్రెవేశపెట్టామన్నారు. కిశోర్‌ బాలలకు కిట్లు పంపిణీ చేశారు. చింతపల్లికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఐఏపీ 2012-13 కింద రూ. 3000 లక్షలతో తాగునీటి భవనాలు, రహదారులు, వంతెనలు, సర్వశిక్షాభియాన్‌ కింద రూ. 5,544 లక్షలతో 1023 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన, రూ. 3496ల నాబార్డు నిధులతో 21 రహదారులు, 25 పాఠశాల భవనాలకు శుంకుస్థాపన, రూ. 800 లక్షలతో పాడేరు, అరకులోయ 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు. అలాగే 13 ఆర్థిక సంఘం నిధులు రూ. 591 లక్షలతో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్మాణానికి శంకుస్థాపన, రూ.2985 లక్షల ప్రపంచ బ్యాంకు వ్యయంతో 127 గ్రామీణ మంచి నీటి పథకాలకు శంకుస్థాపన, రూ.1500 లక్షల ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధులతో కిండంగి, తాజంగి, బాలారాం గ్రామాల్లో సమగ్ర మంచి నీటి పథకాలకు శంకుస్థాపన, పాడేరులో నిర్మించిన రక్షిత మంచినీటి పథకానికి సీఎం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గిరిజన మహిళా సమాఖ్యకు రూ. 1,156 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. 304 మంది గిరిజన లబ్ధిదారులకు రూ. 81.20 లక్షల విలువ గల ఆర్థిక సహాయక పథకాలు పంపిణీ చేశారు. రూ. 2.10 లక్షలతో గిరిజన లబ్ధిదారులకు కంప్యూటర్లు, పిండి మిల్లు, వడ్రండి పరికరాలు, షామియానాలు, మైకుసెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మౌలిక సదుపాయాలు, ఓడ రేవుల శాఖామాత్యులు గంటా శ్రీనివాసరావు, గిరిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు, అరకులోయ శాసన సభ్యులు సీవేరి సోమ, గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌, కలెక్టర్‌ శేషాద్రి, పాడేరు ఐటీడీఏ ఇన్‌ఛార్జి పీఓ, జేసీ ప్రవీణ్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పాఠశాలలో కాసేపు...పాడేరులో పర్యటించిన సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్థానిక తలార్‌సింగ్‌ పాఠశాలలో విద్యార్థులతో కొద్ది సమయాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గిరిజన విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న, ఇటీవల విద్యార్థులకు మెస్‌ ఛార్జీలు పెంచామని వెల్లడించారు. వసతి గృహాల్లో నిరంతరవిద్యుత్తు కల్పించే యెచనలో 'విద్యా జ్యోతి' పథకాన్ని ప్రారంభించారు. దీంతో ఇన్వెర్టర్లను అమర్చి విద్యార్థులకు విద్యుత్‌ సౌకర్యం కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా నిర్మించిన 'రూపాంతర్‌' భవనాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో మమేకమై సహభంక్తి భోజనానికి ఏర్పాట్లు చేసినా సమయం కొద్దిగా ఉండటంతో సీఎం సమాయాన్ని కేటాయించలేకపోయారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి