Loading...

24, డిసెంబర్ 2012, సోమవారం

నేడే సింహాద్రినాథుని ఉత్తర దర్శనం

విశాఖపట్నం రూరల్, చైతన్యవారధి: పరమ పవిత్రమైన ముక్కోటి (వైకుంఠ) ఏకాదశిని పురస్కరించుకుని సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వార దర్శనానకి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ప్రభావత
ఆరాధనలు ముగిశాక గోదాదేవి అమ్మవారి, గోవిందరాజస్వామివారి బేడా మండప తిరువీది నిర్వహిస్తారు. ఐదు గంటల సమయంలో దేవాలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి వంశీయులు తొలి దర్శనం అనంతరం, జిల్లాకు చెందిన మంత్రులు, ఆ తర్వాత సామాన్య భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లపై ఇన్‌చార్జి ఈవో డి.భ్రమరాంబ, నార్త్ ఏసీపీ బర్ల ప్రసాదరావు, సీఐ నరసింహారావు ఆదివారం సమీక్షించారు.
ఉత్తరాంధ్ర జిల్లాలకుచెందిన వేలాది మంది భక్తులు స్వామిని దర్శించేందుకు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం సజావుగా జరిగేందుకు ఆలయంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లను ఏసీపీ దేవాలయ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. శాంతిభత్రదలకు విఘాతం కలగకుండా చూసేందుకు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సుమారు 130 మంది పోలీసులను సింహగిరిపై నియమించినట్టు ఏసీపీ తెలిపారు.
వీవీఐపీలు, వీఐపీల కారణంగా సాధారణ భక్తులు ఇబ్బందులు పడకుండా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు కావాల్సిన తాగునీరు, ప్రసాదాలు, నిత్యాన్నదాన ప్రసాదం నిర్విఘ్నంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఇన్‌చార్జి ఈవో భ్రమరాంబ తెలిపారు. భక్తుల రవాణా సౌకర్యార్థం వేకువజామున మూడు గంటల నుంచి సింహగిరిపైకి, కొండ దిగువకు బస్సుల నడుపుతున్నట్టు, సింహాచలం ఆర్టీసీ డీఎం సీహెచ్ రామకృష్ణ ప్రకటించారు.


కిక్కిరిసిన సింహగిరి
ముగిసిన పగల్‌పత్‌ ఉత్సవాలు: ముక్కోటి ఏకాదశి గా భావించి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆదివారం సింహగిరి కిక్కిరిసిపోయింది. ఉత్తర ద్వార దర్శనం సోమవారం అని తెలుసుకుని భక్తులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం ఆదివారం కల్పిస్తుంటే ఇక్కడ ఇలా చేశారేమిటని పలువురు భక్తులు ప్రశ్నించారు. దీనిపై ఆలయ వైదిక వర్గాలు భక్తులకు వివరణ ఇచ్చారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు షామియానాలు, టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. స్వామి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకున్నారు. ప్రసాదాల విక్రయశాలలో ప్రసాదాల కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నృసింహమండపం ఎదురుగా ద్విచక్ర వాహనాలను నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులెదుర్కొన్నారు. పది రోజుల నుంచి ఎంతో వైభవంగా కొనసాగుతున్న అప్పన్న పగల్‌పత్‌ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా స్వామి ఉత్సవమూర్తులకు ఆస్థానమండపంలో వేదపారాయణలు, దివ్యప్రబంధ సేవలు నిర్వహించారు. స్వామి తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. ఆస్థానమండపంలో జరిగిన స్వామి నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశిగా భావించి కొందరు భక్తులు సాయంత్రం కొండమెట్ల మార్గంలో దీపాలు వెలిగించారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి