Loading...

3, డిసెంబర్ 2012, సోమవారం

మంత్రి గంటాకు ఎమ్మెల్యేల పరామర్శ

హైదరాబాద్, డిసెంబర్ 2 : దీపావళి రోజు చిచ్చుబుడ్డి కాలుస్తుండగా పేలడంతో గాయపడిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. పాదానికి కట్టు కట్టుకొని కొద్దిగా నెమ్మదిగా నడుస్తూ ఆయన అటూ ఇటూ తిరిగారు. సాధారణంగా ఫ్యాంట్ తప్ప మరేదీ వేయని ఆయన ఈ దెబ్బ వల్ల అడ్డ పంచె కట్టుకొని అసెంబ్లీకి వచ్చారు.
ఆయనను వివిధ పార్టీల ఎమ్మెల్యేలు పరామర్శించి ఆరోగ్య పరిస్ధితిని వాకబు చేశారు. 'చిచ్చుబుడ్డి పేలి నిప్పు ముద్ద వచ్చి పాదంపై పడటంతో బాగా కాలింది. ఆ రోజు నేను జీన్స్ ఫ్యాంట్ వేసుకోవడం వల్ల మంటలు వ్యాపించలేదు. మామూలు ఫ్యాంట్ అయి ఉంటే మంటలు శరీరం అంతా వ్యాపించేవి. మొదట మూడు నాలుగు రోజులు నొప్పి తీవ్రంగా ఉంది. ఇప్పుడు నొప్పి తగ్గింది. గాయం పూర్తిగా మాని అక్కడ చర్మం పూర్వం మాదిరిగా ఏర్పడటానికి కొంత సమయం పడుతుంది' అని ఆయన వివరించారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి