Loading...

28, డిసెంబర్ 2012, శుక్రవారం

బడ్జెట్‌ ముసాయిదాపై సమీక్ష

విశాఖపట్నం, డిసెంబరు ౨౭(చైతన్యవారధి): మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)కు సంబంధించి 2013-14 సంవత్సరానికి రూ.2077.84 కోట్లతో బడ్జెట్‌ రూపొందించామని ప్రత్యేక అధికారి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబ్‌ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన బడ్జెట్‌ ముసాయిదాపై ముఖ్య విభాగాల
అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొత్త ఆర్థిక సంవత్సరంలో వివిధ పద్దుల కింద రూ.2,200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశామని, ఇందులో 2077.84 కోట్లు ఖర్చుగా చూపామన్నారు. ఈసారి బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద చేపట్టిన ప్రాజెక్టులు 2013లో పూర్తి చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తాజాగా చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాను మేరకు బడ్జెట్‌లో ఆయా వర్గాల ప్రజల సంక్షేమం కోసం తగిన కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. జనాభా ఆధారంగా వీరి కోసం నిధులు కేటాయిస్తామని శాంబాబ్‌ తెలిపారు. మురికివాడల్లో 50 శాతానికిపైగా ఉన్న ఎస్సీ, ఎస్టీల కోసం తగిన నిధులు బడ్జెట్‌లో చూపాలని అధికారులకు సూచించామన్నారు. ఆస్తి పన్ను కింద కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశామన్నారు. నగరంలోని అనేకచోట్ల ఆస్తి పన్ను విధింపులో లోపాలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. నివాస గృహాల్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం, చాలా ఇళ్లకు ఇప్పటికీ పన్ను వేయకపోవడం వంటివి తన దృష్టికి వచ్చాయన్నారు. భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్‌) కింద ఈ లోపాల్ని సవరించే ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రకటనలు, వినోద, వృత్తి పన్ను కింద ఆదాయాన్ని పెంచుకోవలసి ఉందని అభిప్రాయపడ్డారు.

ఏలేరు పైపులైను కోసం నివేదిక
ఏలేరు నుంచి కాలువ స్థానంలో పైపులైను నిర్మాణం కోసం ప్రభుత్వానికి రూ.1,905 కోట్లతో సవివర పథక నివేదిక (డీపీఆర్‌) పంపామని ప్రత్యేకఅధికారి తెలిపారు. దీంతో ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి నష్టాల నుంచిబయటపడొచ్చన్నారు. నగరంలో సైక్లింగ్‌ కోసం రూపొందించిన ప్రత్యేక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం-2 కింద దీన్ని మంజూరు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. జీవీఎంసీ ఆధ్వర్యంలోని కల్యాణ మండపాల్లో నిర్ణయించిన కంటే ఎక్కువ అద్దె వసూలు చేస్తున్న విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఇందుకోసం అవసరమైతే నిర్ణయించిన ధరల బోర్డులు కల్యాణ మండపాల ఆవరణలో వేలాడ తీసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని చాలాచోట్ల కల్యాణ మండపాల్లో అగ్ని ప్రమాద నివారణ,పార్కింగ్‌ సదుపాయం కల్పించడం లేదన్నారు. దీనిపై పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని పురపాలక, నగరపాలక సంస్థల కమిషనర్లను ఆదేశించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో వుడా వీసీ కోన శశిధర్‌, జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్‌ జయరామిరెడ్డి, అదనపు కమిషనర్లు పూర్ణచంద్రరావు, రమేశ్‌, పద్దుల పరిశీలకులు సత్యనారాయణ, సీఎంహెచ్‌వో పీవీ రమణమూర్తి, కార్యనిర్వాహక ఇంజినీర్‌ కేవీఎన్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి