Loading...

28, డిసెంబర్ 2012, శుక్రవారం

కొత్త సంవత్సర వేడుకలలో ఇబ్బందులు సృష్టింస్తే కఠిన చర్యలు

-సీపీ శివధర్‌రెడ్డి వెల్లడి
విశాఖపట్నం, డిసెంబరు ౨౭(చైతన్యవారధి): కొత్త సంవత్సర వేడుకలలో ఇబ్బందులు సృష్టింస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ శివధర్‌రెడ్డి  హెచ్చరించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతరులకు ఇబ్బందులకు గురిచేసేలా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం సరికాదని సూచించారు. వేగంగా
వాహనాలను నడపడం, సైలెన్సర్లు తీసేయడం, సర్కస్‌ ఫీట్లు చేయడం, మద్యం తాగి ప్రయాణించడం వంటి పనులు చేసేవారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. బీచ్‌రోడ్‌లో గత ఏడాది 1.50 లక్షల మంది సంబరాల్లో పాల్గొన్నారని, ఈసారి కూడా అదే సంఖ్యలో వస్తారనే అంచనాతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. డిసెంబరు 31 సాయంత్రం నుంచే పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆల్కోమీటర్లతో మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తిస్తామన్నారు. మద్యం దుకాణాలను నిర్ణీత సమయం దాటి తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దొంగతనాల ఘటనల్లో అత్యధికంగా సొత్తు స్వాధీనం చేసుకోవడంలో విశాఖ పోలీసు కమిషనరేట్‌ రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని తెలిపారు. నగరంలో నేర సంఘటనలు, వాటిని చేధించిన తీరును వివరించారు. ఈనెల 25 వరకు చోటు చేసుకున్న 1,429 దొంగతనాల్లో రూ.6.86 కోట్ల సొత్తు తస్కరించారని, వీటిలో 745 కేసులను ఛేదించి రూ.5.35 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 78 శాతంతో విశాఖ కమిషనరేట్‌ ప్రథమస్థానం పొందిందని, సైబరాబాద్‌ కమిషనరేట్‌ 71.5 శాతంతో రెండోస్థానంలో నిలిచిందన్నారు. నగరంలో 14 బందిపోటు దొంగతనాలు జరుగగా 11 కేసుల్ని చేధించి 59 మందిని అరెస్టు చేశామని, 27 దోపిడీ ఘటనలకు సంబంధించి 22 కేసుల్లో 38 మందిని జైలుకు పంపామన్నారు. ఈ ఏడాది 19 ముఠాలకు చెందిన వంద మందిని అరెస్టు చేసి 315 కేసులను ఛేదించామన్నారు. వీటిలో 161 కమిషనరేట్‌కు చెందినవి కాగా మిగిలినవి ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు సంబంధించినవన్నారు. నిందితుల నుంచి మొత్తం రూ.5.39 కోట్ల సొత్తు, బంగారం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించగలిగామని, 2010లో 1,767 ప్రమాదాలు జరగ్గా 460 మంది మరణించారని, 2011లో 1,343 ప్రమాదాల్లో 432 మంది మృత్యువాత పడ్డారని, 2012లో 1,047 ప్రమాదాల్లో 367 మంది చనిపోయారని చెప్పారు. మోటారు వాహనాల చట్టం కిందట 2010లో 90,808 కేసులు నమోదు చేయగా, 2012లో 2,75,000 కేసులు నమోదు చేసి, అపరాధ రుసుము కింద రూ.4కోట్ల పైగానే వసూలు చేశామని వివరించారు. మహిళలపై నేరాలు 2010లో 543, 2011లో 512, 2012లో 536 జరిగాయన్నారు. 2012లో ఇప్పటివరకు హత్యలు 38, దొమ్మీలు 12, అపహరణలు 25, అత్యాచారాలు 49, హత్యాయత్నాలు 25, మోసాలు 205, వరకట్న మరణాలు 11 చోటుచేసుకున్నాయన్నారు. మాయమాటలతో అధిక వడ్డీల ఆశచూపి వసూళ్లకు పాల్పడే వ్యక్తులు, సంస్థలను వదిలే ముచ్చటే లేదని సీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. బాధితులు ఇలాంటి సంస్థలపై ఫిర్యాదు చేయకపోవడమే ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఫిర్యాదులు అందడంతో సిద్ధివిఘ్నేశ్వర, స్పార్క్‌, మ్యాజిక్‌ సంస్థలపై కేసులు నమోదు చేశామన్నారు. మ్యాజిక్‌ మినహా ఇతర సంస్థల యజమానుల్ని అరెస్టు చేశామన్నారు. ఇలాంటి వ్యాపారాలే చేస్తున్న ఇతర సంస్థల నిర్వాహకులను అనుమతి పత్రాలు చూపించాలని ఆదేశించామన్నారు. మోసపూరిత సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  సమావేశంలో ఏడీసీపీలు మహ్మద్‌ఖాన్‌, అచ్యుతరావు, ఏసీపీలు వెంకట్రావు, రాజారావు, రెండోపట్టణ సి.ఐ. మెహనరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి