Loading...

29, డిసెంబర్ 2012, శనివారం

తెలంగాణపై నెలరోజుల్లో నిర్ణయం

అఖిలపక్షం అనంతరం షిండే
 న్యూఢిల్లీ:  ప్రత్యేక తెలంగాణా అంశంపై నెల రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటించారు. సమావేశ అనంతరం ఆయన మాట్లాడుతూ సమావేశం మంచి వాతావరణంలో జరిగింది. ప్రతినిధుల అభిప్రాయాలన్నింటినీ మేం గమనంలోకి తీసుకున్నాం. కొన్ని పక్షాలు సాధ్యమైనంత త్వరగా నిర్ణయం చెప్పాలని కోరాయి. మరికొన్ని పక్షాలు నెలరోజుల్లోపు నిర్ణయం వెల్లడించాలని సూచించాయి. సమావేశం వివరాలను నేను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాను. ఆ తర్వాత నెల రోజుల్లోపు మేము ఒక ఫలితంతో ముందుకొస్తామన్నారు. రాష్ట్రంలోని 8 రాజకీయ పక్షాలతో శుక్రవారమిక్కడ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా ఊహించిన విధంగానే కాంగ్రెస్‌ పార్టీ కాని, కేంద్ర ప్రభుత్వం కానీ సమావేశంలో ఏదో ఒక స్పష్టమైన వైఖరిని, నిర్ణయాన్ని వెల్లడించలేదు. గత సమావేశాల్లో మాదిరిగానే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెండు ప్రాంతాల ప్రతినిధులూ రెండు స్వరాలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణా అంశాన్ని ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నదీ స్పష్టం చేయలేదు. నెల రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడిస్తామని, ఇదే చివరి అఖిలపక్ష సమావేశమని హోం మంత్రి భేటీ సందర్భంగా స్పష్టం చేయడమే కొంత సానుకూల అంశం. హోం మంత్రి షిండే, సిఎం కిరణ్‌ ఆలస్యంగా రావడంతో శుక్రవారం ఉదయం పదిగంటలకు జరగాల్సిన అఖిలపక్ష సమావేశం అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక్కడి నార్త్‌బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో సుమారుగా గంట పాటు జరిగిన ఈ సమా వేశంలో షిండేతో పాటు హోం శాఖ ఉన్నతాధికారులూ పాల్గొన్నారు. సమావేశానికి కాంగ్రెస్‌ తరపున సురేష్‌రెడ్డి, గాదె వెంకటరెడ్డి, టిడిపి తరపున యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి, సిపిఎం తరపున బివి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, టిఆర్‌ఎస్‌ తరపున కెసిఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, సిపిఐ తరపున నారాయణ, గుండా మల్లేష్‌, బిజెపి తరపున కిషన్‌రెడ్డి, హరిబాబు, ఎంఐఎం తరపున అసదుద్దీన్‌ ఒవైసీ, జివిజి నాయుడు హాజరయ్యారు. గతంలో మాదిరిగా ఈ సమావేశంలో హోం మంత్రి షిండే ప్రారంభోపన్యాసమేమీ చేయలేదు. అధికార పార్టీగా కాంగ్రెస్‌ తన వైఖరేమీ చెప్పనక్కర్లేదని సమావేశంలో కాంగ్రెస్‌ ప్రతినిధి సురేష్‌రెడ్డి తొలుత వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్‌ తన అభిప్రాయం చెప్పని సమావేశంలో పాల్గొనడంలో అర్ధం లేదని పేర్కొంటూ భేటీ నుండి వాకౌట్‌ చేయడానికి సిపిఎం సిద్ధపడింది. అనంతరం కాంగ్రెస్‌ ప్రతినిధులు కూడా తమ వైఖరిని చెబుతారని షిండే పేర్కొనడంతో తెలంగాణాకు అనుకూలంగా సురేష్‌రెడ్డి మాట్లాడారు. సమావేశం చివరిలో సమైక్యవాదాన్ని బలపరుస్తూ ఆ పార్టీ మరో ప్రతినిధి గాదె వెంకటరెడ్డి తన వైఖరిని వెల్లడించారు. గత సమావేశాల్లో రెండు ప్రాంతాల తరపునా రెండు వాదనలను వినిపించిన టిడిపి ఈ దఫా పంథా మార్చుకుంది. తెలంగాణా అంశంపై 2008లోనే తమ వైఖరిని వెల్లడిస్తూ నాటి విదేశాంగ మంత్రి ప్రణబ్‌కు లేఖ రాశామని, ఆ లేఖను ఇప్పటికీ వెనక్కు తీసుకోలేదని భేటీలో పాల్గొన్న ఇద్దరు ప్రతినిధులూ ఒకే మాట చెప్పారు. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రాసిన లేఖను షిండేకు వారు అందజేశారు. లేఖలో తెలంగాణాకు అనుకూలమని ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. 2008 లేఖ విషయాన్నే ప్రస్తావించారు. సమావేశంలో తెలంగాణా వాదాన్ని బలంగా వినిపించిన టిఆర్‌ఎస్‌, బిజెపి, సిపిఐ సత్వరం ఒక నిర్ణయం తీసుకోవాలని హోం మంత్రిని డిమాండ్‌ చేశాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన సరికాదన్న వైఖరిని సిపిఎం పునరుద్ఘాటించింది. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ తమ వైఖరులను వెల్లడించకుండా, ఇతరుల పేరు చెప్పి కాలయాపన చేయడం సరికాదంటూ నిలదీసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ వైఖరని ఎంఐఎం స్పష్టం చేసింది.

ఒకవేళ విభజించాల్సిన పరిస్థితులు ఏర్పడితే హైద్రాబాద్‌తో కూడిన రాయల తెలంగాణాను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది. తొలిసారి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం స్పష్టమైన నిర్ణయం చెప్పలేదు. తెలంగాణా సెంటిమెంటును గౌరవిస్తున్నామని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాల విభజనపై కేంద్ర ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ ప్రతినిధులిద్దరూ సమావేశంలో పేర్కొన్నారు. స్థూలంగా చూస్తే సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే రెండు స్వరాలను వినిపించింది. సిపిఎం, ఎంఐఎం మినహా ఇతర పక్షాలు తెలంగాణా పట్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సానుకూలత వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ కాలయాపన ధోరణిని సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా సిపిఎం గట్టిగా నిలదీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నెల రోజుల వ్యవధిలో తెలంగాణా అంశంపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని భేటీని ముగిస్తూ షిండే వెల్లడించారు. మరోసారి అఖిలపక్ష భేటీ అవసరం కూడా ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలోనూ వెల్లడించారు. అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం అన్ని పార్టీల ప్రతినిధులూ మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ మినహా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ సమావేశం జరిగిన తీరు పట్ల, షిండే హామీల పట్ల స్థూలంగా సంతృప్తి వ్యక్తం చేశాయి. సమావేశంలో కాంగ్రెస్‌, టిడిపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన వైఖరిని చెప్పనందుకు నిరసనగా, కేంద్ర ప్రభుత్య సాగదీత వైఖరికి వ్యతిరేకంగా శనివారం తెలంగాణా బంద్‌ను నిర్వహిస్తున్నట్లు టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ ప్రకటించారు. మరోవైపు తెలంగాణా కాంగ్రెస్‌ ఎంపీలు కూడా సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపి వైఖరిపై హర్షం తెలుపుతూ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణా ద్రోహిగా అభివర్ణించారు. సమావేశం ప్రారంభ సమయంలో తెలంగాణా విద్యార్థి పరిషత్‌కు చెందిన కార్యకర్తలు నార్త్‌బ్లాక్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. కేంద్రం తక్షణం తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించాలంటూ వీరు పెద్ద ఎత్తున నినాదాలు చేయగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి