Loading...

17, డిసెంబర్ 2012, సోమవారం

ధనుర్మాసోత్సవాలు ప్రారంభం

పెందుర్తి, చైతన్యవారధి: అప్పన్న ఆలయంలో ఆదివారం ధనుర్మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామికి సుప్రభాత సేవ, ఆరాధన అనంతరం భక్తులకు స్వామి దర్శనభాగ్యం కల్పించారు. స్వామికి తిరుప్పావై సేవా కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సేవాకాలం జరిపారు. దేవాలయంలో రాజగోపురంపై నెలగంట మోగించారు.
కొండ దిగువన గల గ్రామాలకు నెలగంటు పెట్టినట్లు మైకుల ద్వారా తెలిపారు. రాజభోగం అనంతరం అయ్యవారిసేవ, అమ్మవారి తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పగల్‌పత్‌ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆస్థాన మండపంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేశారు. ఉభయదేవేరుల సమేతుడైన స్వామికి నిత్యకల్యాణం జరిపారు.

ఉపమాక వెంకన్న ఆలయంలో .....
నక్కపల్లి, చైతన్యవారధి: ఉపమాక వెంకన్న ఆలయంలో ఆదివారం ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ధనుర్మాస ప్రవేశ సమయం తెల్లవారు 4:16 గంటలకు పూజా కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా నిత్యార్చన, బాలభోగనివేదన ఇతర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గ్రామంలో బలిహరణ చేపట్టారు. తర్వాత సతీసమేతుడైన వెంకన్నని గజవాహనంపై వేంచేయింపచేసి సేవ జరిపారు. అదే విధంగా గోదాదేవి రూపంలో ఉన్న ఆండాళ్లమ్మవారిని వెనుక పల్లకీ వాహనంలో వూరేగించారు. భక్తులు గ్రామంలో ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్‌ పెంకులరాజు, ఈఓ శేఖర్‌బాబు, అర్చకులు కృష్ణమాచార్యులు ఉద్యోగులు రంగనాథస్వామి, మహేశ్‌ పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి