Loading...

21, డిసెంబర్ 2012, శుక్రవారం

ఐరావత్‌పై బాధితుల ఫిర్యాదు

నర్సీపట్నం, చైతన్యవారధి: రెండు రోజులుగా దోబూచులాడుతున్న ఐరావత్‌ సంస్థపై బుధవారం సాయంత్రం ఏఎప్పీ టి.ఇక్బాల్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు గురువారం మరికొంతమంది పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా తమను నమ్మబలికి డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ చేయడం వల్ల అనుమానం కలగలేదన్నారు.
తాము తీసుకువచ్చిన ఆధారాలను పరిశీలించడంతో పాటు స్టేషనుకు అప్పగించిన వ్యక్తులను పూర్తిస్థాయిలో విచారణ చేస్తే నిజాలు వెల్లడవుతాయని బాధితులు అంటున్నారు. డిపాజిటర్లు సొమ్మును వెనక్కి ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఒక డైరెక్టర్‌ ఫోన్‌లో మాట్లాడుతున్నాడని, మిగిలినవారిని కూడా అతడి ద్వారా రప్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నర్సీపట్నం పట్టణవాసులు ఒక్కొక్కరుగా స్టేషనుకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఈ కేసుపై ఏఎస్పీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ దర్యాప్తు ప్రారంభించడంతో సంస్థల ప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

దర్యాప్తు చేసి చర్యలు చేపడతాం: ఏఎస్పీ
అధిక వడ్డీలు ఇస్తామంటూ ఆశ చూపిన సంస్థలపై బాధితుల ఫిర్యాదులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అలాంటివాటిపై విచారణ చేసి దర్యాప్తు అనంతరం నేరం రుజువైతే చర్యలు చేపడతామని నర్సీపట్నం ఏఎస్పీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ అన్నారు. అధిక వడ్డీలు ఇవ్వడం సాధ్యం కాదని, అలాంటి మాయ మాటలు చెప్పేవారిని నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఇప్పటికే అధిక వడ్డీలు ఆశ చూపే కంపెనీలపై నిఘా పెట్టామని చెప్పారు. బాధితులు ఎవరైనా ఉంటే తమకు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి