Loading...

13, డిసెంబర్ 2012, గురువారం

బాలలను యాచకులుగా మార్చితే కఠిన చర్యలు

కార్మిక శాఖ కమిషనర్‌ రామాంజనేయులు హెచ్చరిక
హైదరాబాద్‌: యాచక వృత్తిలోకి బాలలను దించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని కార్మిక శాఖ కమిషనర్‌ రామాంజనేయులు హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని టి.అంజయ్య భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు బృందాలలో 40 మంది సభ్యులతో దాడులు చేసి 15 మంది బాల
యాచకులను, 28 మంది చిన్నపిల్లలు, వారి తల్లులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. కూడళ్ల వద్ద చంటిపిల్లలను ఎత్తుకుని యాచించే తల్లులు, 14 ఏళ్లలోపు పిల్లలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కొందరు సొంత తల్లులు కాగా మరికొందరు అద్దెకు పిల్లలను తెచ్చుకుంటున్నారని వివరించారు. అధికారులు అజయ్‌, గంగాధర్‌, నరేశ్‌, వరహాలరెడ్డి, పోలీసులు, ఐసీడీఎస్‌, రాజీవ్‌ విద్యామిషన్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఎంవీ ఫౌండేషన్‌, దివ్యదిశ లాంటి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు.

తెలుగులోనే నామఫలకాలు ఉండాలి
తెలుగులో నామఫలకాలు ఏర్పాటు చేసుకోవాలని దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలకు రామాంజనేయులు స్పష్టం చేశారు. ఇప్పటికే గడువు ముగిసినందున జరిమానాలతో కాకుండా దుకాణాల ఫలకాలపై రంగులు చల్లుతామని తెలిపారు. అప్పటికీ స్పందించకుంటే శాఖాపరమైన చర్యలు చేపడతామన్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి