Loading...

20, డిసెంబర్ 2012, గురువారం

తుపాను నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం

ఆనందపురం, చైతన్యవారధి: గతనెల్లో జిల్లాను కుదిపేసిన నీలం తుపాను కారణంగా జరిగిన నష్టాలను కేంద్ర బృందం పరిశీలించింది. అయిదు జిల్లాల్లో పర్యటించి తుపాను నష్టాలను తెలుసుకొనేందుకు 8మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందం బుధవారం ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకుంది. వీరు రెండు బృందాలుగా వీడారు. నలుగురు సభ్యులతో
కూడిన ఒక బృందం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లగా, మరో నలుగురు సభ్యుల బృందం విశాఖలో ఉంది. జిల్లాకు వచ్చిన బృందానికి జాతీయ రహదారుల సంస్థప్రాంతీయ కమిషనర్‌ అశ్వనీకుమార్‌ నాయకత్వం వహించారు. ఈ బృందంలో జాతీయ నీటి యాజమాన్య సంస్థ ఎస్‌.ఇ. రమేష్‌కుమార్‌, మత్స్య,పశుసంవర్ధకశాఖ ఉపకమిషనర్‌ ఎ.పి.చతుర్వేది, కేంద్ర ప్రభుత్వ అండర్‌ కార్యదర్శి తివారిలు సభ్యులుగా ఉన్నారు. వీరంతా గవర్నర్‌ బంగ్లాకు గురువారం రాత్రి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. నవంబరు మొదటి వారంలో వచ్చిన నీలం తుపాను కారణంగా నష్టపోయిన పంటల వివరాలను జిల్లా రెవెన్యూ అధికారి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నీలం తుపాను కారణంగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశామని, దాదాపు రూ.350కోట్ల మేర ఆస్తులకు నష్టం జరిగినట్లు డీఆర్వో వెల్లడించారు. 53హెక్టార్ల పరిధిలో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, దీనిలో వరి, చెరకు వంటి పంటలకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. ఇళ్లకు, ప్రభుత్వ ఆస్తులు, రహదారులు, నీటిపారుదల, పంచాయతీరాజ్‌ తదితర శాఖలకు చెందిన రహదారులు, కల్వర్టులు వంటి వాటికి నష్టం వాటిల్లిందని డీఆర్వో కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను వారికి చూపించారు. గురువారం ఈ బృందం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి