Loading...

9, డిసెంబర్ 2012, ఆదివారం

కాబోయే ఉపాధ్యాయులకు ఒకే పరీక్ష!

హైదరాబాద్, డిసెంబర్ 8: టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్), డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ(డీఎస్సీ).. ఈ రెండింటి స్థానంలో 'ఉమ్మడి పరీక్ష' నిర్వహించి, ఉపాధ్యాయ నియామకాలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) మార్గదర్శకాలకు లోబడి, సిలబస్‌లో మార్పులు లేకుండా
ఈ ఉమ్మడి పరీక్ష నిర్వహించే అంశంపై దృష్టి సారించింది. గత కొంతకాలంగా వివిధ కోణాల నుంచి సమాచారాన్ని సేకరించిన అనంతరం ప్రభుత్వం నిరుద్యోగులపై ఒత్తిడిని తగ్గించే చర్యలకు ఉపక్రమించింది.

2013లో పోస్టుల భర్తీ నుంచే 'ఉమ్మడి పరీక్ష' విధానానికి శ్రీకారం చుట్టేందుకు సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం తమిళనాడులో ఉపాధ్యాయుల ఎంపికకు 'టెట్'తో అనుసంధానం చేస్తూ అమల్లో ఉన్న 'సింగిల్ టెస్ట్' పద్ధతి తరహాలోనే మన రాష్ట్రంలోనూ 'ఉమ్మడి పరీక్ష'ను అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం నలుగురు అధికారులతో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ.. తమిళనాడులో అమలు చేస్తోన్న ఉపాధ్యాయుల ఎంపిక పద్ధతిని అధ్యయనం చేసి నెలాఖరులో నివేదిక సమర్పించనుంది.

ప్రస్తుతం దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానంలో ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన అభ్యర్థులకు మార్కుల మెరిట్ ఆధారంగానే టీచర్ ఉద్యోగాలు ఇస్తున్నారు. 'టెట్' నిర్వహణను తప్పనిసరి చేసిన తర్వాత తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో టెట్‌తో అనుసంధానం చేస్తూ ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు. తమిళనాడుపై అధ్యయనం చేస్తున్న కమిటీ నివేదిక అందిన అనంతరం ప్రభుత్వం ఉమ్మడి పరీక్ష నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ విషయమై రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖా మంత్రి కె.పార్థసారధిని 'ఆంధ్రజ్యోతి' వివరణ అడగ్గా.. టెట్ , డీఎస్సీల స్థానంలో ఉమ్మడి పరీక్ష నిర్వహించేలా ఆలోచిస్తున్నామని.. వచ్చే ఉపాధ్యాయ నియామకాల నుంచే ఈ కొత్త పద్ధతిని అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు పర్యాయాలు 'టెట్ ' నిర్వహించారు. ఎలిమెంటరీ స్కూళ్ల టీచర్ల కోసం పేపర్-1, హైస్కూళ్ల టీచర్ల కోసం పేపర్-2 నిర్వహిస్తున్నారు.

150 మార్కులకు టెట్ నిర్వహిస్తూ అందులో 90 మార్కులు వచ్చిన ఓసీలు, 75 మార్కులు సాధించిన బీసీలు, 60 మార్కులు పొందిన ఎస్సీ/ఎస్టీలు అర్హులైనట్లు ప్రకటిస్తున్నారు. అయితే డీఎస్సీలో మాత్రం కటాఫ్ మార్కులు లేవు. డీఎస్సీ-2012లో టెట్ మార్కులకు వెయిటేజి ఇస్తున్నారు. టెట్, డీఎస్సీలు కలిపి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తే.. ఎన్‌సీటీఈ మార్గదర్శకాలకు లోబడి టెట్ నిర్వహించాల్సి ఉన్నందున ఉమ్మడి పరీక్షలో క్వాలిఫైయింగ్ మార్కులు అనివార్యమవుతాయి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి