Loading...

8, డిసెంబర్ 2012, శనివారం

జీవీఎంసీలో గుత్తేదారులుగా ఇంజినీర్లు...

విశాఖపట్నం, చైతన్యవారధి: మహా విశాఖ నగరపాలక సంస్థలో ఇంజినీర్లే గుత్తేదారులుగా బినామీ పేర్లతో కోట్లరూపాయల విలువైన పనులు చేస్తున్నారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ గుత్తేదారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఓఎస్‌ఆర్‌ చౌదరి డిమాండ్‌ చేశారు. శుక్రవారం గుత్తేదారుల కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బినామీల వ్యవహారాన్ని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లామని,
అంతర్గత బదిలీలకు సిఫార్సు చేసినా ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదన్నారు. జీవీఎంసీ ఇంజినీర్లు, ఒప్పంద కార్మికులు, పొరుగుసేవల ఉద్యోగులు నామినేషన్‌ పనులు చేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారన్నారు. గుత్తేదారులపై కొంత మంది అధికారులు దుష్ప్రచారం చేస్తున్నారని, తమ సంఘం అధ్యక్షుడు రొంగలి జగన్నాథంపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పని పూర్తిచేసిన తొమ్మిది నెలలకు జీవీఎంసీ బిల్లులు మంజూరు చేస్తుందని, దీంతో ఎంతో మంది గుత్తేదారులు ఇబ్బంది పడుతున్నా, నగర అభివృద్ధిలో భాగస్వామ్యులమవుతున్నామనే భావనతో పనిచేస్తున్నామన్నారు. గుత్తేదారుల హక్కులపై కమిషనర్‌కు తెలియజేస్తామని, న్యాయం జరగకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు డి.నారాయణరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి సనపల వరప్రసాద్‌, బి.వెంకటరావు, పీఎస్‌ ప్రసాద్‌, కేజీ రామారావు, ఆర్‌.నరసింగరావు, పీవీవీఎన్‌ రాజు, శ్రీనివాసులనాయుడు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి