Loading...

24, డిసెంబర్ 2012, సోమవారం

వెనక్కి తగ్గని యువత

యువబృందంతో సోనియా, రాహుల్‌ చర్చలు
చట్టాల సమీక్షకు నోటిఫికేషన్‌ విడుదల
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బస్సులో పారా మెడికల్‌ విద్యార్థినిపై పాశవికంగా జరిగిన అత్యాచారం, దాడి సంఘటన ఢిల్లీలో చిచ్చు రగిల్చింది. ఆ సంఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరగడంతో కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దిగింది. సంయమనం వహించి, శాంతించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ ఆదివారం
ప్రదర్శకుల్ని కోరారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోలేమని, వివేచనతో, సహేతుకంగా తీసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ ఆమె నివాసం 10, జనపథ్‌లో ప్రదర్శకు లతో ఆదివారం గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఆ సమావేశానికి హోంశాఖ సహాయమంత్రి ఆర్‌పిఎన్‌ సింగ్‌, పార్టీ ప్రతినిధి రేణుకా చౌదరి కూడా హాజరయ్యారు. ‘ప్రదర్శకుల తరఫున ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం తమ డిమాండ్లను మా ముందు ఉంచారు. వారి సూచనల్ని కూడా మేము నమోదు చేసుకున్నాం. ఇంతవరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వారికి వివరించాం. శాంతియుతంగా వ్యవహరించమని వారిని కోరాం. అవసరమైన అన్ని చర్యలూ తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని హోంశాఖ సహాయమంత్రి ఆర్‌పిఎన్‌ సింగ్‌ చెప్పారు. జరిగిన సంఘటనపట్ల యువత మనోభావాలను తను అర్థం చేసుకున్నానని, వారి మనోద్వేగాలను గౌరవిస్తున్నానని రాహుల్‌గాంధీ తనను కలిసిన యువకుల బృందంతో అన్నారు. ఈ సమస్య చాలా భావావేశంతో కూడుకున్నదని చెబుతూ రాహుల్‌ - ‘సహేతుకంగా, వివేచనతో నిర్ణయం తీసుకోవడం జరగాలి.
కేవలం ఆవేశంతో నిర్ణయాల్ని తీసుకోలేం’ అన్నారు. ఇలాంటి దారుణ సంఘటనలు జరగకుండా నివారించేందుకు యువకులు సహేతుకమైన సూచనలు చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కోరారు. ఇలాంటి ఘోరమైన నేరానికి పాల్పడిన వారిని ఆలస్యం చేయకుండా, ఫాస్ట్‌ ట్రాక్‌ల ద్వారా త్వరగా శిక్షించాలన్నారు. ప్రదర్శకులతో జరిపిన సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వారి మనోభావాలతో ఏకీభవించినట్టు తెలిసింది. మహిళల్లో భద్రతా భావాన్ని కలిగించేందుకు చేయాల్సింది చాలా ఉందని, ఈ సంఘటన వారిని నిజంగా భయకంపితుల్ని చేసిందని సోనియా అభిప్రాయపడ్డారు. ఈ కేసును త్వరితగతిన నడిపించి, నేరస్థులకు శిక్ష పడేలా అన్ని చర్యలూ తీసుకుంటామని సోనియాగాంధీ తనను కలిసిన యువతకు హామీ ఇచ్చినట్టు కూడా తెలిసింది. పోలీసులు చురుకుగా వ్యవహరించేలా తక్షణం చర్య తీసుకోవాలన్న యువత సూచనతో సోనియాగాంధీ పూర్తిగా ఏకీభవించారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, ఇతర నేరాలకు సంబంధించిన కేసుల్లో నేరస్థుల్ని శిక్షించేందకు చట్టాల్ని మరింత కఠినతరం చేయాలని కూడా సోనియాను కలిసిన యువకులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో మరో ఆలోచన లేదని, చట్టాల్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్‌గాంధీ అభిప్రాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి ప్రదర్శకులు పెద్ద సంఖ్యలో 10, జనపథ్‌ ముందు గుమికూడారు. వారిని కలుసుకునేందుకు సోనియాగాంధీ ఇంట్లోంచి బయటికి వచ్చారు. ప్రదర్శకులతోపాటు ఆమె కూడా నేలపై కూర్చున్నారు. దాదాపు 20 నిముషాలు వారితో మాట్లాడారు. ఆదివారం ఉదయం వారి ప్రతినిధి బృందాన్ని కలుసుకొని మాట్లాడాలనుకుంటున్నానని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వారితో అన్నారు. ఆ నేపథ్యంలోనే ఆదివారం సోనియాగాంధీ ప్రదర్శకుల బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఒక శుభారంభం కలుగుతుందని తను విశ్వసిస్తున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రేణుకాచౌదరి చెప్పారు. ఇలాంటి సంఘటన తిరిగి జరగకుండా నివారించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించినట్టు రేణుకాచౌదరి తెలిపారు. ‘శాంతియుతంగా మెలగమని మేం వారిని అభ్యర్థించాం. యువకులు ఇంత పెద్ద ఎత్తున కదిలి రావడం చాలాచాలా ఉత్సాహాన్ని కలిగిస్తోంది’ అన్నారామె. మహిళలపై నేరాలు జరగకుండా ఎదుర్కొనేందుకు, నివారించేందుకు ప్రదర్శకుల ప్రతినిధులు 12-13 సూచనలు చేశారని సింగ్‌ చెప్పారు. ‘ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్లో ఈ కేసు విచారణ జరుగుతుందని ఈ సమావేశంలో ప్రదర్శకుల ప్రతినిధులకు హామీ ఇవ్వడం జరిగింది’ అని హోంశాఖ సహాయమంత్రి చెప్పారు.
అయితే, ఫలానా కాలపరిమితిలో నేరస్థుల్ని శిక్షించడం జరుగుతుందని చెప్పేందుకు ఆయన నిరాకరించారు. ‘మేము ప్రదర్శకులకు విజ్ఞప్తి చేశాం. వారి డిమాండ్లను తీరుస్తామని చెప్పాం. ప్రభుత్వం వారు చెప్పింది సావధానంగా, వివరంగా విన్నది. వారి డిమాండ్లకు సానుకూలంగా వ్యవహరిస్తున్నాం’ అని మంత్రి తెలిపారు. న్యూఢిల్లీలో 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించడంపై అడగ్గా సింగ్‌ దాన్ని సమర్థించారు. ‘శనివారం కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయి. చాలామంది యువకులు గాయపడ్డారు. మళ్లీ అలా జరగడాన్ని మేం కోరడంలేదు. యువకుల్ని కాపాడేందుకే ఈ చర్య తీసుకున్నాం’ అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి