Loading...

30, డిసెంబర్ 2012, ఆదివారం

అత్యాచార బాధితురాలు మృతి

సింగపూర్‌ నుంచి మృతదేహం తరలింపు
న్యూఢిల్లీ: సామూహిక అత్యాచారానికి గురై 13 రోజులపాటు చావు బతుకుల పోరాటంలో కొట్టుమిట్టాడిన ఆమె శనివారం  సింగపూర్‌లో తుదిశ్వాస విడిచారు. శరీరం లోపల, మెదడులో తీవ్రమైన గాయాలు కావటం వల్ల పలు అవయవాలు పని చేయడం మానేశాయని.. ఫలితంగా ఆమె మరణించారని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రి సీఈవో
డాక్టర్‌ కెల్విన్‌ లోహ్‌ ప్రకటించారు. ఆమె మరణించిన తర్వాత కెల్విన్‌ సింగపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ''ఈ నెల 27న ఆందోళనకర పరిస్థితిలో ఈ ఆసుపత్రిలో చేరిన అత్యాచార బాధితురాలు శనివారం తెల్లవారుజాము 4.45 గంటలకు (సింగపూర్‌ కాలమానం) మృతి చెందారు. ఆమెను బతికించేందుకు ఎనిమిది మంది వైద్య నిపుణుల బృందం శాయశక్తుల కృషి చేసింది. వైద్య పరిభాషలో అత్యంత ప్రమాకర స్థాయిగా పేర్కొనే సెరెబ్రెల్‌ ఎడెమా వల్ల ఆమె మృతి చెందారు. ఆమె మెదడుకు నీరుపట్టడం వల్ల పుర్రెపై ఒత్తిడి పెరిగింది. కణజాలం నశించింది. కీలక అవయవాలు పూర్తిగా పని చేయడం మానేశాయి. ఫలితంగా బాధితురాలిని రక్షించడం కష్టమైంది'' అని తెలిపారు. ఈ నెల 27న ఆమెను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

సామూహిక అత్యాచారం అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలికి ఈ నెల 17 నుంచి సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వటం ప్రారంభించారు. తొలుత ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నా తర్వాత ఆందోళనకరంగా పరిణమించింది. అయితే మంగళవారం నుంచి క్రమేణా విషమించడం మొదలుపెట్టింది. ఆమె మెదడు దెబ్బతినడంతోపాటు గుండెపోటు కూడా సంభవించడంతో వైద్యనిపుణుల సిఫార్సు మేరకు సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రికి గురువారం తరలించారు. అప్పటికే ఆమె అవయవాలు క్రమక్రమంగా పనిచేయడం మానివేశాయి. శుక్రవారం రాత్రి బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు మౌంట్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆమె తుదిశ్వాస విడిచారు.

బరువెక్కిన హృదయాలు
అత్యాచార బాధితురాలి మృతితో యావత్‌ భారతదేశం విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా రాజధానివాసులు ఈ సమాచారం తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువత మళ్లీ ఎలాంటి విధ్వంసానికి దిగుతుందో అన్న అనుమానంతో ఢిల్లీ పోలీసులు ముందుజాగ్రత్తగా 144వ సెక్షన్‌ విధించారు. ఇండియా గేటు పరిసరాలను మూసివేశారు. పది మెట్రో స్టేషన్లను సైతం బంద్‌ చేశారు. ప్రదర్శనకారులను నియంత్రించేందుకు మధ్య ఢిల్లీలో 28 కంపెనీల పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించారు. ప్రజలు శాంతియుతంగా ప్రదర్శనలు జరపాలని, ఇందుకు జంతర్‌ మంతర్‌, రాంలీలా మైదాన్‌లలో ఆందోళనలకు అనుమతి ఇస్తామని పోలీసులు వెల్లడించారు. బాధితురాలి మృతికి సంతాపం తెలిపేందుకు జంతర్‌మంతర్‌కు వేల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. కొవ్వొత్తులు వెలిగిస్తూ, మౌనం పాటిస్తూ.. బాధాతప్త హృదయాలతో నివాళి అర్పించారు. అక్కడ విషాద వాతావరణం నెలకొంది. మృతి వార్త వినగానే సామాజిక వెబ్‌సైట్లు, సెల్‌ఫోన్‌ల ద్వారా సంక్షిప్త సందేశాలు వెల్లువెత్తాయి. నల్ల దుస్తులు ధరించి జంతర్‌ మంతర్‌కు రావాలన్న పిలుపును అందుకొని పలువురు నల్లదుస్తులతో వచ్చారు. మరోవైపు ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు అరవింద్‌ కేజ్రివాల్‌, మనీష్‌ సిసోడియా తమ అనుచరులతో కలిసి నోటికి నల్ల వస్త్రాలను కట్టుకొని జంతర్‌ మంతర్‌లో నిరసన తెలిపారు.
సిగ్గుగా ఉంది: షీలాదీక్షిత్‌
ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ శనివారం జంతర్‌మంతర్‌లో జరిగిన నిరసన ప్రదర్శనకు సంఘీభావం తెలిపారు. ఓ చెట్టు వద్ద కొవ్వొత్తు వెలిగించి మృతురాలికి సంతాపం ప్రకటించారు. ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలిసి కూడా షీలాదీక్షిత్‌ ధైర్యంగా ఇక్కడికి రావడం గమనార్హం. అయితే, ఆమె రాగానే శాంతియుతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారే నినాదాలు హోరెత్తాయి. 'షీలా వెనక్కి వెళ్లిపో' అంటూ ప్రదర్శనకారులు నినదించారు. దీంతో ఏమీ మాట్లాడకుండానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకుముందు సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. ''దేశ రాజధానిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సిగ్గుగా ఉంది. భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి ప్రసాదించాలి. దయచేసి ప్రతి ఒక్కరూ శాంతి పాటించండి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి'' అని విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక విమానంలో మృతదేహం తరలింపు
బాధితురాలి మృతదేహాన్ని ఒక ప్రత్యేక విమానంలో సింగపూర్‌ నుంచి ఢిల్లీకి తరలించారు. ఈ విమానం శనివారం రాత్రి పది గంటలకు (భారత కాలమానం) సింగపూర్‌లో బయల్దేరింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి