Loading...

31, డిసెంబర్ 2012, సోమవారం

కాపులంతా బీసీ జాబితాలో చేరేలా జీవో

- మంత్రి గంటా హామీ
విశాఖపట్నం, చైతన్యవారధి: కాపుల సంక్షేమాభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. గోపాలపట్నం పెట్రోల్‌బంకువద్ద ఆదివారం ఏర్పాటుచేసిన కాపు, తెలగ, బలిజ వనభోజన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల బీసీలుగా, మరికొన్నిచోట్ల ఓసీలుగా
కాపులున్నారన్నారు. అందరినీ బీసీ జాబితాలో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక జీవోను జారీచేయిస్తానని హామీఇచ్చారు. పెందుర్తి, గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లోని కాపుల సౌకర్యార్థం భారీ కల్యాణ మండపంతోపాటు పేదవిద్యార్థులకు వసతి గృహం, వృద్ధుల కోసం అనాథాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో గెలుపోటములు ప్రభావితం చేయగల సత్తా కాపులకుందన్నారు. అవసరమైతే రాజకీయం వదిలి కాపు సంక్షేమం కోసం పోరాటం చేస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల, గాజువాక ఎమ్మెల్యే చింతపూడి అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, మాజీ కార్పొరేటర్లు జియ్యాని శ్రీధర్‌, గల్లా శ్రీనివాసరావు, బాణాల శ్రీనివాసరావు, శానాపతి అప్పారావు, అడవివరం సొసైటీ ఛైర్మన్‌ కర్రి స్వామి, గుడివాడ గురునాథరావు సతీమణి నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

రాజకీయాలను శాసించే స్థాయిలో కాపులు: అనకాపల్లి, చైతన్యవారధి: రాజకీయాలను శాసించే స్థాయికి కాపులు ఎదిగారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సత్యనారాయణపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం సమీపంలో ఆదివారం అనకాపల్లి నియోజకవర్గ తూర్పు కాపు సంఘ కుటుంబాల ఆధ్వర్యంలో వనసమారాధన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక సీట్లు కాపులు కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాపు కులస్తులు శాసించిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి, మంత్రి హోదాలో నిలబెట్టిన ఘనత నియోజక వర్గ కాపులకే దక్కుతుందన్నారు. కాపు కులస్తులను బీసీ కేటగిరీలో చేర్చేవిధంగా జిల్లాకు చెందిన కాపు ఎమ్మెల్యేలు ప్రముఖులతో చర్చించినట్టు చెప్పారు. అవసరమనుకుంటే బీసీ కుల ధ్రువపత్రాల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రిని కాపు నాయకులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, భీమిలి, పెం దుర్తి, గాజువాక శాసన సభ్యులు ము త్తంశెట్టి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు, న్యాయవాది కాత్యాయని, జనపరెడ్డి భవానీ, పలకా రాము తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి