Loading...

28, డిసెంబర్ 2012, శుక్రవారం

అంగరంగ వైభవంగా ప్రారంభమైన తెలుగు మహా సభలు

తిరుపతి, డిసెంబర్ 27 : నాలుగో ప్రపంచ తెలుగు మహా సభలు గురువారం తిరుపతిలో అంగరంగ వైభవంగా  ప్రారంభమయ్యాయి. ఈ సభల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి  తెలుగుకు వరాల జల్లు కురిపించారు. ప్రారంభ వేడుకల్లో ఆయన తెలుగు భాషోద్ధరణకు సంబంధించి పలు హామీలు ఇచ్చారు. ఏనాడో మూతపడిపోయిన రాష్ట్ర
సంగీత, సాహిత్య, నాటక, లలితకళా అకాడమీల పునరుద్ధరణ.. తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ.. పదోతరగతి దాకా బోధనలో నిర్బంధ తెలుగు.. వంటి ప్రకటనలు భాషాభిమానులకు శ్రవణానందం కలిగిస్తున్నాయి.  చర్చలు, తీర్మానాలతో నిమిత్తం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పష్టమైన ప్రకటనలు చేశారు. అదేవిధంగా పాలన, బోధన, ప్రసార మాధ్యమంగా తెలుగు భాషను అమలు చేస్తామని పేర్కొన్నారు. తిరుపతిలో తెలుగు భాషా సంస్కృతులకు సంబంధించి అంతర్జాతీయ సమావేశ మందిరాన్ని నిర్మిస్తామని ప్రకటించిన సీఎం.. ఆ మేరకు సమావేశ మందిర నిర్మాణానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో వేదిక మీదే శంకుస్థాపన చేయించారు. కాగా.. నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు గురువారం అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి.వేలాదిగా తరలివచ్చిన భాషాభిమానులు సభలకు నిండుదనాన్ని తీసుకొచ్చారు. 'తెలుగుతేజం' పుస్తకాన్ని గవర్నర్ నరసింహన్ ఈ వేడుకల్లో ఆవిష్కరించారు. అంతకుముందు ఉదయం 7.30 గంటలకు ముఖ్యమంత్రి తిరుపతి పూర్ణకుంభం కూడలిలో.. 11 అడుగుల ఎత్తున్న తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు, కళాకారులు, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి జ్యోతి ప్రజ్వలన చేసి సభలను ప్రారంభించారు. ఈ సమావేశానికి సీఎం కిరణ్ అధ్యక్షత వహించగా నిర్వాహకుడుగా సాంస్కృతిక మండలి సలహాదారు కె.వి.రమణాచారి వ్యవహరించారు. ప్రధాన వేదికపై నుంచి రాష్ట్రపతి, గవర్నర్ ప్రసంగిస్తూ తెలుగు భాష గొప్పదనాన్ని, తీయదనాన్ని కొనియాడారు. మధ్యాహ్నం తరువాత ప్రధాన వేదికతో పాటు పది ఉప వేదికల్లో కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. కళావేదికల వద్ద జనం కిటకిటలాడారు. చర్చావేదికల వద్ద జనస్పందన నామమాత్రంగా కనిపించింది. ప్రధానవేదికపై శోభానాయుడు, రాజారెడ్డి, రాధారెడ్డి కూచిపూడి నృత్యాలు, డా. స్వప్నసుందరి విలాసిని నృత్యం, బేతవోలు రామబ్రహ్మం బృందం త్రిభువన విజయం సాహితీ రూపకం, సినీ సంగీత విభావరి, గుమ్మడి గోపాలకృష్ణ బృందం కురుక్షేత్రం పద్యనాటకం ఆహూతులను రంజింపజేశాయి. అయితే, ఈ సభల్లో నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొనేందుకు వచ్చిన కళాకారులు.. తమకు సరైన సౌకర్యాలు కల్పించలేదని నిర్వాహకులపై మండిపడ్డారు. తమకు భోజనం పెట్టలేదని, వసతి ఇవ్వలేదని.. తాగడానికి మంచినీళ్లు కూడా పోయలేదని నిప్పులు చెరిగారు. మరోవైపు.. తెలుగు భాషోద్ధరణకు సీఎం ప్రకటించిన వరాలపై పలు విమర్శలు వినిపించాయి. పాఠశాలల్లో తెలుగు బోధనకు చంద్రబాబు హయాంలోనే జీవో వచ్చిందని.. కానీ, అది అమలుకు నోచుకోలేదని.. కొత్తగా ఇలా ఎన్ని జీవోలు ఇచ్చినా అమల్లో చిత్తశుద్ధి లేకపోతే ఉపయోగం లేదని పలువురు విమర్శించారు. ఇక ప్రత్యేక మంత్రిత్వ శాఖ అని సీఎం ప్రకటించినా.. అది సాంస్కృతిక శాఖలో ఒక భాగంగానే ఉంటుంది తప్ప, దానికి నిధులు కూడా ఉండబోవని మరికొందరు అనుకోవడం కనిపించింది. ముఖ్యమంత్రి చెప్పినవాటిలో అకాడమీల పునరుద్ధరణ ఒక్కటే కొత్తగా ఉందని, దాన్ని అమలు చేస్తే మంచిదేనని ప్రతినిధులు భావించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి