Loading...

4, జనవరి 2013, శుక్రవారం

చౌక దుకాణాల్లో రాయితీతో మరో 5 నిత్యావసర సరకులు

- సంయుక్త కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి
 హైదరాబాద్‌, జనవరి ౩: రాష్ట్రంలో రానున్న ఉగాది నుంచి మరో ఐదు నిత్యావసర సరకులను రాయితీ ధరతో చౌక దుకాణాల ద్వారా అందించనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. బియ్యంతో పాటు చింతపండు, అయోడైజ్డ్‌ ఉప్పు, పామోలిన్‌, మిరపపొడి, పసుపుపొడిని సబ్సిడీ ధరతో అందిస్తామని తెలిపారు. ఉగాది నుంచి
బియ్యం సహా నిత్యావసర సరకుల బుట్టను అందిస్తామన్నారు. ప్రజలు ప్రత్యేకంగా గుర్తించేలా చౌక దుకాణాల రూపురేఖలు మారుస్తామని చెప్పారు. మీ సేవా కేంద్రాల తరహాలో ఇవి కూడా ఒకే రూపంతో ఉంటాయన్నారు. రాష్ట్ర సంయుక్త కలెక్టర్ల రెండు రోజుల సదస్సును ముఖ్యమంత్రి గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ శామ్యూల్‌, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులు అశుతోష్‌మిశ్రా, ఎ.సి.పునేఠా సహా పలువురు ఐఏఎస్‌ అధికారులు, సంయుక్త కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. నగదు బదిలీ పథకం గురించి ప్రజలకు వివరించాలని సంయుక్త కలెక్టర్లకు సూచించారు. మీసేవా కేంద్రాల్లో త్వరలో సిటిజన్‌ ఛార్టర్‌ను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఛార్టర్‌ ప్రకారం నిర్దేశించిన గడువులోపు సర్టిఫికెట్లు ఇవ్వాలని, లేదంటే సేవల ఆలస్యానికిగాను దరఖాస్తు దారులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. మీసేవా కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ 49 సేవలు అందిస్తుండగా.. త్వరలో వంద సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంయుక్త కలెక్టర్లు జిల్లాల్లో విస్తృతంగా తిరగాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధిపొందే అర్హుల్ని గుర్తించడమే కీలకాంశమని, ఈ విషయంలో జేసీలు క్రియాశీలకంగా ఉండాలని కోరారు. భూములు విలువ బాగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు. భూములు ఎంత అవసరమో అంతే ఇవ్వడానికి అవకాశం కల్పిస్తూ కొత్త భూకేటాయింపు విధానం తీసుకువచ్చామని చెప్పారు. డీకేటీ భూముల వివాదాలను సత్వరం పరిష్కారించాలని కోరారు. అపరిష్కృత భూ వివాదాలు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తాయని గుర్తుంచుకోవాలన్నారు. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు వల్ల నష్టపోయినవారికి అందించే ప్యాకేజీని సక్రమంగా ఇవ్వాలన్నారు. గరిష్టంగా ఎంత పరిహారం ఇవ్వగలమో అంత ఇచ్చి భూముల్ని సేకరించాలని సూచించారు. సంయుక్త కలెక్టర్లు విధిగా నెలలో ఒకటి రెండు రోజులు ప్రభుత్వ వసతి గృహాల్లో బస చేసి పిల్లలకు సరైన ఆహారం అందించడంతోపాటు మంచి వాతావరణంలో ఉండేలా దృష్టి సారించాలని కోరారు. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. రెవెన్యూ శాఖలో ఖాళీల భర్తీ, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడం, ప్రత్యేక రెవెన్యూ అకాడమీ ఏర్పాటు, మండల రెవెన్యూ కార్యాలయాలకు భవనాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
త్వరలో అనుసంధానం: రఘువీరా
రాష్ట్రంలో రెవెన్యూ-రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య అనుసంధానం త్వరలో చేస్తామని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జేసీలు సదస్సును ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ భూముల్ని కాపాడాలని, దీనిపై జేసీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. శ్మశానాలకు అవసరమైన ప్రభుత్వ భూమిని ఇవ్వాలని, అందుబాటులో లేకుంటే ప్రైవేటు భూముల్ని సేకరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు క్రమం తప్పకుండా నిర్వహించాలని, నగదు బదిలీ పథకం అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి