Loading...

21, జనవరి 2013, సోమవారం

సమైక్యాంధ్ర కోసం ఉద్యమించండి...

ఉద్యోగ సంఘాలకు మంత్రి గంటా సూచన
విశాఖపట్నం, జనవరి ౨౦: సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలని, దీనికోసం రాష్ట్ర మంత్రులుగా తమ అండదండలు ఉంటాయని ఉద్యోగ సంఘాల నాయకులకు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతులు కల్పన శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం మంత్రి గంటాను ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఐక్యాచరణ
సమితి నేతలతో పాటు విద్యుత్తు ఉద్యోగ సంఘాల నాయకులు గవర్నర్‌ బంగ్లాలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ నెల 21న ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పార్టీనేతలతో పాటు కేంద్రమంత్రులను కలవనున్నామన్నారు. శనివారం ఎన్జీఓ సంఘం రాష్ట్ర నేతలు తమను కలిశారని, ఈ సమయంలో కూడా ఉద్యోగులు ఉద్యమించాలని చెప్పారన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఉద్యమిస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్నారు. ప్రజా ప్రతినిధులుగా మా అండదండలు ఉంటాయని, ఈ విషయంలో రెండో ఆలోచనే లేదన్నారు. రాష్ట్రాన్ని విడగొడితే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాను పాటు పడతానన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఐక్యాచరణ సమితి (ఐకాస) జిల్లా ఛైర్మన్‌ కె.ఈశ్వర్రావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. సమైక్యాంధ్రను కోరుతూ ఈనెల 22న నగరంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు మధ్యాహ్నం 3.30గంటలకు కలెక్టరేట్‌ నుంచి మొదలయ్యే ప్రదర్శన పోలీసు బ్యారెక్స్‌ మీదుగా జగదాంబ వరకు సాగుతుందన్నారు. అన్ని రాజకీయ పక్షాల నేతలను ప్రదర్శనకు ఆహ్వానిస్తామన్నారు. జె.ఎ.సి. కన్వీనరు టి.గోపాలకృష్ణ మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు వంటి నేతలు సైతం సమైక్యాంధ్రను కోరుకున్నారని, దీని కోసం ఉద్యోగ వర్గమంతా కట్టుబడి ఉందన్నారు. విద్యుత్తు ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు కె.ఎన్‌.వి.రామారావు, పోలాకి శ్రీనివాసరావులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం చేపట్టే ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, వుడా మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.ఎ.రెహ్మాన్‌లు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నాయకులు లగుడుగోవింద గవర్నర్‌ బంగ్లా వద్దకు వచ్చారు. మంత్రి గంటాశ్రీనివాస్‌ను కలిసి అనంతపురం జిల్లాలో ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తుంటే ఇక్కడ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దీంతో పక్కనే ఉన్న ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య జోక్యం చేసుకోవడంతో వాగ్వాదానికి దారితీసింది. పక్కనే ఉన్న ఇతర నేతలు సర్దిచెప్పడంలో వివాదం సద్దుమణిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి