Loading...

21, జనవరి 2013, సోమవారం

పాడేరుకు పది కొత్త బస్సులు

ఆర్టీసీ కార్యనిర్వాహక సంచాలకుడు రమణారావు
విశాఖపట్నం, జనవరి ౨౦: రాష్ట్ర రహదారి రవాణా సంస్థ(ఆర్టీసీ) విశాఖ ప్రాంతీయం పరిధిలోని పాడేరుకు త్వరలో పది కొత్త బస్సులు నడిపిస్తామని సంస్థ నిర్వహణ, ఆస్తుల యాజమాన్యం, సమాచార యాజమాన్య వ్యవస్థ విభాగాల కార్యనిర్వాహక సంచాలకుడు(ఈడీ) జి.వి.రమణారావు వెల్లడించారు. ఘాట్‌రోడ్లపై నడిపించేందుకు వీలుగా ఈ
బస్సులను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే నాలుగు బస్సులు విశాఖ చేరుకున్నాయని, మిగతావి వచ్చిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. ఆదివారం మధ్యాహ్నం విశాఖ ప్రాంతీయ ప్రబంధకుని కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ద్వారకా బస్‌ ప్రయాణ ప్రాంగణం ఆధునికీకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మధురవాడలో కొత్త డిపో నిర్మాణం తుది మెరుగులు దిద్దుకుంటోందని, మద్దిలపాలెం డిపోని అక్కడికి తరలిస్తామన్నారు. మద్దిలపాలెం డిపోని అభివృద్ధి చేసి కింది భాగం టెర్మినల్‌గా వినియోగించి పై అంతస్తుల్లో వ్యాపార, వాణిజ్య కూడలిగా నిర్మిస్తామన్నారు. ఈ మేరకు నమూనాతోకూడిన సవివర పథక నివేదిక రూపకల్పన కోసం కన్సల్టెన్సీకి ఇచ్చామన్నారు. విజయనగరం జోన్‌ కార్యనిర్వాహక సంచాలకుడు(ఈడీ) ఎ.రామకృష్ణ మాట్లాడుతూ బస్సుల నిర్వహణపరంగా ప్రైవేటు బస్సులపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ప్రయాణికులకు అందించే సేవల్లో, నిర్వహణ లోపాలున్నట్లు రుజువైన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే ఏడు బస్సులకు చెందిన ఒప్పందాలను రద్దుచేశామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సంస్థ సమాచార సాంకేతిక, ఇంజినీరింగ్‌ విభాగాల ఈడీ జి.జయారావు, విశాఖ ప్రాంతీయ ప్రబంధకుడు(ఆర్‌ఎం) వై.జగదీశ్‌బాబు, ఉప ముఖ్య రవాణా ప్రబంధకులు(డీసీటీఎం) వీరయ్య చౌదురి(నగరం), పబ్బా జీవన్‌ ప్రసాద్‌ (గ్రామీణ) తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి