Loading...

7, జనవరి 2013, సోమవారం

నగదు బదిలీ ప్రారంభం

- సీఎం, కేంద్ర మంత్రి చేతులమీదుగా లబ్ధిదారులకు నగదు చెల్లింపు
కాకినాడ, జనవరి ౬: వచ్చే రెండు మూడు నెలల్లో రాష్ట్రమంతటా ఆధార్‌ అనుసంధానిత సేవలను విస్తరింపజేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాన్ని అయిదు సంక్షేమ పథకాలకు వర్తింపజేస్తూ ఆదివారం తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో కేంద్రమంత్రి జైరాం రమేష్‌తో కలిసి
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పథకాన్నైనా 'తూర్పు' నుంచే ప్రారంభించడం సెంటిమెంట్‌గా మారిందన్నారు. గతంలో కిలో రూపాయి బియ్యం పథకాన్ని, ఇందిరమ్మబాటను రాష్ట్రంలో తొలిసారిగా 'తూర్పు' నుంచే ప్రారంభించామని గుర్తుచేశారు. ఆధార్‌తో అనుసంధానం వల్ల అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. ఆరు నెలల్లో 10 లక్షల సూక్ష్మ ఏటీఎంలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8.46 కోట్ల జనాభాకు 6.29 కోట్లమంది ఆధార్‌ నమోదు చేయించుకున్నారన్నారు. అందులో 5 కోట్లమందికి ఆధార్‌ నంబర్లు ఉన్నాయన్నారు. రెండు, మూడునెలల్లో రాష్ట్రం అంతటా ఆధార్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. ఆధార్‌ వల్ల బోగస్‌ కార్డుదారులకు నష్టం వస్తుందే తప్ప నిజమైన లబ్ధిదారులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. వచ్చే ఉగాది నుంచి రాయితీతో కూడిన మరో అయిదు నిత్యావసర సరకులను చౌకధరల దుకాణాల ద్వారా అందించనున్నామని వివరించారు. ఇటువంటిమంచి పథకాలు మీకు కావాలా? వద్దా అని ముఖ్యమంత్రి ప్రజల నుంచి స్పందనకోరగా.. అందరూ కావాలనే చేతులు పైకిత్తి చూపించారు. పేద ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి కార్యాక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. తాను ముఖ్యమంత్రిని అయ్యేనాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదని, అయినాసరే వెనకడుగు వేయకుండా 26 లక్షలమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, బోధనా ఫీజులకు ఏటా రూ. 4 వేల కోట్లు చెల్లిస్తున్నామన్నారు.
అందరికీ నగదు చెల్లింపు
2013ఆగస్టు నెలాఖరుకు లబ్ధిదారులందరికీ నగదు రూపంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయరాంరమేశ్‌ తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే ఆగస్టు నాటికి అన్ని గ్రామాలకు మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేస్తామన్నారు. 'ఈ రోజు గొల్లప్రోలులో ఇది చిన్న కార్యక్రమంగానే కన్పిస్తున్నా.. రేపు అన్నింటికీ ఇదే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మైక్రో ఏటీఎంల ద్వారా గ్రామాల్లో వ్యాపార కార్యకలాపాలు, చెల్లింపులను నిర్వహించే బాధ్యతను మహిళలకు అప్పజెబుతామన్నారు. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు బిజినెస్‌ కరస్పాండెంట్లుగా సేవలందించవచ్చని చెప్పారు. ఆధార్‌ అనుసంధానం జరిగితే ఎక్కడ నుంచైనా లబ్ధి పొందడానికి వీలు ఉంటుందన్నారు. ఈ విధానంలో అక్రమాలకు తావుండదన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మొదటి స్థానంలో ఉందని, ఇందులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కృషి ఉందని కితాబిచ్చారు.

నగదు పంపిణీ
మైక్రో ఏటీఎంలను ఉపయోగించి వివిధ పథకాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి జయరాంరమేశ్‌లు వేదికపై నగదు చెల్లింపులు చేశారు. సామాజిక పింఛన్లు, విద్యార్థులకు, బాలకార్మికులకు ఉపకార వేతనాలు, ఉపాధి కూలీల వేతనాలను నగదు రూపంలో పంపిణీ చేశారు. ఆన్‌లైన్‌లో ఆధార్‌ గుర్తింపు విధానంలో రేషన్‌ సరకులను అందజేశారు. అనంతరం ఆధార్‌-పీడీఎస్‌ అనుసంధానిత సేవలపై బ్రోచర్‌ను విడుదల చేశారు. వివిధ బ్యాంకులు ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి