Loading...

11, ఫిబ్రవరి 2013, సోమవారం

కుంభమేళాలో తొక్కిసలాట

22 మంది మృత్యువాత
అలహాబాద్‌: త్రివేణీ సంగమంలో అత్యంత వైభవంగా సాగుతున్న కుంభమేళాలో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. రెండు విషాదకర సంఘటనలో ఇరవై రెండుమంది మృత్యువాత పడగా కొన్ని పదులమంది గాయపడ్డారు. ఆదివారం అత్యంత పవిత్రమైన మౌని అమావస్య కారణంగా జనం పవిత్ర స్నానాల కోసం పోటెత్తారు. మూడు కోట్ల మంది
భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించినట్లు అంచనా. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెక్టార్‌ 12 వద్ద స్వల్పంగా తొక్కిసలాట చోటుచేసుకోవడంతో వారణాసి నుంచి వచ్చిన ఒక మహిళ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక భక్తుడు చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట కారణంగా 20 మంది చనిపోగా మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరపాలని ప్రధాని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌కు అవసరమైన సహాయ చర్యలను అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారనేది తెలియరాలేదు. ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను రెండు గంటలపాటు ప్లాట్‌ఫారం మీదనే ఉంచేయడం ప్రయాణికులను కలచివేసింది. బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదకర వాతావరణం నెలకొంది. లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత తిరుగు ప్రయాణం కోసం సాయంత్రం అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వేలాదిమంది ప్రయాణికులు ఐదు, ఆరు నెంబరు ప్లాట్‌ఫారాల మీద వేచి ఉన్నారు. స్టేషన్లోకి ఒక రైలు వస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రయాణికులు వంతెన మీదుగా అటువైపు ప్లాట్‌ఫారానికి వెళ్లడం కోసం తోసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో చాలామంది కిందపడిపోయారు. ఈ దుర్ఘటనలో 20 మంది చనిపోయినట్లు గుర్తించారు. ఆరో నెంబరు ప్లాట్‌ఫారానికి వెళ్లే దారిని మూసేయడంతోపాటు పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం వల్ల జనం చెల్లాచెదురై తొక్కిసలాట చోటుచేసుకుందని ప్రత్యక్షసాక్షులు ఆరోపించారు. రైల్వేమంత్రి బన్సల్‌ జరిగిన ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని ప్రకటించారు. మొదట వంతెన రెయిలింగ్‌ కూలినట్లు అనుమానాలు వ్యక్తమైనా తొక్కిసలాట వల్లనే ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు ప్రకటించారు. రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా అలహాబాద్‌ నుంచి బయలు దేరాల్సిన పలు రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు చేరుకోవలసిన పలు రైళ్లను ఎక్కడికక్కడ ఆపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ రైలు ఎప్పుడు వస్తుందో, ఏ రైలు ఎప్పుడు బయలుదేరుతుందో సమాచారం లేక, రైలు దాటిపోతే గమ్యానికి చేరుకునే మార్గం ఎలాగో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వీరిని గమ్య స్థానాలకు చేర్చడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం రైల్వే శాఖను అభ్యర్థించింది. ప్రయాణికులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి రైల్వేను ఆదేశించారు.

ప్రమాదంపై చంద్రబాబు, చిరంజీవి దిగ్భ్రాంతి
హైదరాబాద్‌: మహాకుంభ మేళాలో తొక్కిసలాట ఘటనలపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొందరు చనిపోవడం, మరికొందరు గాయపడడంపై ఆయన విచారం తెలిపారని తెదేపా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. బాధితులకు వైద్య సహాయం అందించాలని, మృతుల కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు. కుంభమేళా ఘటనపై కేంద్రమంత్రి చిరంజీవి విచారం వ్యక్తం చేశారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి