Loading...

11, ఫిబ్రవరి 2013, సోమవారం

మాతృభాషతోనే ప్రజలకు చేరువ

- తెలుగులో న్యాయ పాలన సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 1౦: మాతృభాషలో న్యాయ పాలన ద్వారా న్యాయ వ్యవస్థ గౌరవం ఇనుమడిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి న్యాయ వ్యవస్థ ముందుకు వస్తే అందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని చెప్పారు. అధికార భాషా సంఘం, న్యాయ విద్యాపరిషత్తు సంయుక్త
ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ జూబ్లీహాలులో జరిగిన 'తెలుగులో న్యాయపాలన' సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ మహాసభల స్ఫూర్తితో అన్ని చోట్లా తెలుగు కనిపించేలా, వినిపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మన సంస్కృతికి పిల్లలు దూరమవుతున్నారనే ఆందోళన అందరిలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ వంద కిలోమీటర్లకు తెలుగు యాస, భాష మారుతోందన్నారు. సమాజంలో, కుటుంబంలో తెలుగు వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆంగ్లంతో పాటు మాతృభాషను తప్పనిసరి చేశామని తెలిపారు. బాల్యం నుంచే నేర్చుకుంటే మాతృభాషపై మమకారంతో పాటు పట్టు పెరుగుతుందన్నారు. విద్యార్థులు తెలుగును కాపాడుకుంటూనే ఆంగ్లంలో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. దేశంలో స్వేచ్ఛా, స్వాతంత్యాలను పరిరక్షిస్తోంది న్యాయ వ్యవస్థేననని కొనియాడారు. న్యాయ స్థానాలలో తెలుగు వినియోగానికి న్యాయ వ్యవస్థ ముందుకు రావడం శుభ పరిణామమని, దీంతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. వాదనలు, తీర్పులు తెలుగులో ఉంటే కక్షిదారులకు ఉపయుక్తంగా ఉంటుందని, వారు సంతృప్తితో ఉంటారని అన్నారు. న్యాయపాలన సదస్సు తీసుకునే నిర్ణయాలను తమ ప్రభుత్వం శిరసావహిస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్‌ మాట్లాడుతూ, ఇతర భాషల కంటే మాతృభాషలోనే సరైన భావ వ్యక్తీకరణ ఉంటుందని అన్నారు.
మాతృభాష ఆవశ్యకతను రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఎప్పుడో చెప్పారని ప్రస్తావించారు. జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు మాతృభాషకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయన్నారు. దేశంలో హిందీ, బెంగాలీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగేనన్నారు. న్యాయస్థానాల్లో తెలుగుభాష వినియోగించడం ద్వారా ప్రజలకు సులభంగా అర్థమవడంతో పాటు న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావడానికి దోహద పడుతుందని చెప్పారు. తెలుగులో న్యాయపాలనకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని, న్యాయపదకోశాలు, న్యాయశాస్త్ర గ్రంథాలు, చట్టాలను అనువదించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. మాతృభాషా వినియోగం వల్ల వ్యవస్థల్లో పారదర్శకత పెరుగుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థ సమాజంలో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన విధంగా స్పందిస్తోందని న్యాయ విద్యా పరిష్యత్తు అధ్యక్షులు జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు గ్రామాల్లో ఉండడం వల్ల వారికి న్యాయస్థానాల్లో ఆంగ్లంలో వెలువడుతున్న తీర్పులు సరిగా అవగతం కాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీన్ని నివారించి, న్యాయవ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. న్యాయ వ్యవస్థకు న్యాయపాలన తప్ప సమాజంతో సంబంధం లేదన్న ఆపోహ ఈ సదస్సుతో తీరిపోతుందని తెలిపారు. ఆంగ్లంలో తీర్పులు ఉండడం వల్ల ఎవరు గెలిచారో, ఎందుకు గెలిచారో, శిక్ష ఎందుకు పడిందో తెలియని పరిస్థితి ఉందన్నారు. తెలుగులో వ్యాజ్యం జరగడం వల్ల కేసు పూర్వాపరాలు సామాన్యులకు తేలికగా అర్థమవుతాయని, కేసులో శిక్ష పడిందా, లేదా? కేసు వాదన ఏ విధంగా జరిగింది? అనేది తెలుస్తుందని, విడాకులు, మనోవర్తి వంటి కేసుల విషయంలో అవసరమయితే సత్వర పరిష్కారానికి వీలుంటుందని జస్టిస్‌ రమణ చెప్పారు. న్యాయపాలన తెలుగులో ఉండాలన్న హైకోర్టు సంకల్పం చరిత్రాత్మకమని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. తెలుగులో న్యాయ పాలన జరిగితే న్యాయస్థానాలపై మరింత విశ్వాసం పెరుగుతుందన్నారు. అర్థమయ్యే భాషలోనే న్యాయస్థానాల కార్యకలాపాలు ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని చెప్పారు. న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగులో న్యాయపాలనపై న్యాయ విద్యాపరిషత్తు సభ్యుడు మంగారి రాజేందర్‌ రాజేందర్‌ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 1874 నుంచి వచ్చిన తెలుగు తీర్పుల ప్రదర్శనను సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలు ప్రారంభించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి